PAWAN: వైసీపీకి పవన్‌కల్యాణ్ మాస్ వార్నింగ్
వైసీపీ నేతల్లారా తొక్కి నార తీస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఘాటు హెచ్చరిక చేశారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో దీపం పథకాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల క్రితం లక్ష్మినరసింహస్వామి ఆలయంలో వెలిగించిన దీపం ఇవాళ రాష్ట్రానికే కాదు దేశానికే వెలుగు ఇచ్చిందన్నారు. మీ అందరూ కలిసి వైసీపీని ఓడించారన్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా వైసీపీ నేతల తీరు వుందని ఆయన మండిపడ్డారు. ఓడిపోయి 11 సీట్లకు పడిపోయినప్పటికీ, వాళ్ల నోళ్లు మాత్రం మూతపడడం లేదన్నారు.
చూస్తూ ఊరుకోబోం
వైసీపీ నేతలు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దీపం 2.0 పథకం కేవలం వంటింట్లో వెలుగు ఇవ్వడం కోసమే కాదు.. ప్రతి ఒక్కరి కడుపు నింపాలనేదే ప్రధాన లక్ష్యం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఏది పడితే అది మాట్లాడుతాం, చేస్తాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఏలూరు జిల్లా జగన్నాథపురం గ్రామంలో 'దీపం 2.0' పథకాన్ని ఆయన ప్రారంభించారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని అన్నారు. వైసీపీ వాళ్లకు యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తామని.. గొడవ కావాలంటే అభివృద్ధికి పాటుపడే గొడవ ఇస్తామని పవన్ చెప్పారు.
వైసీపీకి తెలిసింది దోచుకోవడమే..
వైసీపీ నేతలకు దోచుకోవడం తప్ప, ప్రజలకు ఇచ్చే మనస్తత్వం లేదని పవన్‌కల్యాణ్ అన్నారు. కానీ కూటమి నేతలకు దోచుకునే బుద్ధి లేదన్నారు. ఇచ్చే మనస్తత్వం వుందన్నారు. ఎన్డీఏ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అపార పాలనానుభవం వల్లే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. జనసేన రోడ్డు మీదికి వచ్చి పోరాటం చేయడం వల్లే ప్రతి ఒక్కరికీ ధైర్యం వచ్చిందని పవన్‌కల్యాణ్ తెలిపారు. కూటమి విజయం జనసేన కార్యకర్తలదే అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com