PAWAN: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. మోదీ దేశానికి మూడోసారి ప్రధాని అయ్యారని తెలిపారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం అవ్వాలని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు తాను సిద్ధమని, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పవన్ పేర్కొన్నారు. ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్... క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన శాసనసభ్యులను, సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు.
చంద్రబాబు సారథ్యంలో పనిచేసేందుకు సిద్ధం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ఉపయోగించుకుని, ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కనీసం 15 ఏళ్లు నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని పక్కన పెట్టలేమని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఓర్వకల్లుకు పవన్ కళ్యాణ్ రాక
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 22న కర్నూలు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే నీటి కుంటల పనులను ఓర్వకల్లు మండలం పూడిచర్లలో ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభ ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com