JANASENA: పోటీ చేసే స్థానాలపై జనసేన దృష్టి

JANASENA: పోటీ చేసే స్థానాలపై జనసేన దృష్టి
పవన్‌కల్యాణ్‌ వరుస సమీక్షలు... బలంగా ఉన్న స్థానాలపై చర్చ....

తెలుగుదేశం పార్టీతో పొత్తు నిర్ణయం తర్వాత పోటీచేసే స్థానాలపై జనసేన దృష్టి సారించింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు నిర్వహించారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాల నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తెదేపాతో పొత్తులో జనసేన పోటీ చేసే స్థానాలపై నాయకులతో చర్చించారు. పార్టీ బలంగా ఉన్న స్థానాలు, సామాజిక సమీకరణలపై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. పోటీ చేసే స్థానాలతో పాటు అభ్యర్థుల ఎంపికపైనా సమాలోచనలు జరిపారు. ఈ సమావేశాలు మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.


ఇటీవలే జరిగిన యువగళం సభలో ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు బలంగా నిర్మించాలని మాత్రమే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నానని యువగళం-నవశకం వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో... తెలుగుదేశం-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని... జగన్‌ని ఇంటికి పంపించబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యాపారుల ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ ప్రభుత్వం మారాలని కోరుకున్నానని వివరించారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఇళ్లలోనే కాదు రాష్ట్రంలోనే ఎవ్వరూ ఉండలేని పరిస్థితులు వస్తాయని జోస్యం చెప్పారు. జగన్ ప్రభుత్వం చేసిన ప్రతి అరాచకాన్నీ కేంద్ర పెద్దలకు వివరించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు బాగుపడేవరకూ... జనసేన-తెలుగుదేశం పార్టీల పొత్తు కొనసాగాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు..


మరోవైపు రైతు భరోసా కేంద్రాలను కుంభకోణాలకు నిలయంగా మార్చారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. దాదాపు పదివేల రైతు భరోసా కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించిందన్నారు. వాటి నిర్మాణానికి కేంద్రం నుంచి..... 2 వేల 300 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారని మనోహర్ తెలిపారు.గత ఐదేళ్లలో RBK నిర్మాణాలకు 156 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని, ఇప్పటికీ చాలా కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని అన్నారు. గత ఏడాది నుంచి వాటికి అద్దె కూడా చెల్లించకుండా భవన యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. తుపాను సమయంలో రైతులను ఆదుకోవాల్సిన భరోసా కేంద్రాలు చేతులెత్తేయడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారని మనోహర్ మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story