VARAHI YATRA: నేటి నుంచే వారాహి యాత్ర

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి నాలుగో దశ యాత్ర ఇవాల్టి నుంచి కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది. నాలుగో విడత వారాహి యాత్రకు జనసేన నాయకులు సర్వ సిద్ధం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది. నాల్గో దశ యాత్ర 5రోజుల పాటు కొనసాగుతుంది. టీడీపీపొత్తు ప్రకటన అనంతరం జరుగుతున్న యాత్రలో జన సైనికులతో పాటు తెలుగుదేశం శ్రేణులు, నేతలు పాల్గొనున్నారు. జగన్.. ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు అవసరం లేదో ప్రజలకు వివరిస్తామని జనసేన నేతలు ప్రకటించారు. నాలుగేళ్ల వైకాపా పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు.
ఇప్పటికే తెలుగుదేశంతో కలిసి నడుస్తామని పవన్‌కల్యాణ్ ప్రకటించడంతో అవనిగడ్డ బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయనున్నారు. వారాహి సభకు వచ్చే ప్రతి తెలుగుదేశం కార్యకర్తను ఆత్మీయంగా కలుపుకొని కార్యక్రమం విజయవంతం చేయాలని ఇప్పటికే జనసేన నాయకులకు ఆదేశాలు అందాయి. రాష్ట్రానికి జగన్ ఎందుకు వద్దు అనే విషయాన్ని ప్రజలకు వివరించి... వారిని చైతన్యవంతులను చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర సాగనున్నట్లు జనసేన నేతలు తెలిపారు. మూడు దశల యాత్రలు ఏ స్థాయిలో విజయవంతమయ్యాయో అంతకు మించిన ఉత్సాహంతో నాలుగో విడత కార్యక్రమం జరగాలని... అందుకు నాయకులు, వీర మహిళలు, జన సైనికులు సమష్టిగా కృషి చేయాలని పార్టీ కోరింది. తెలుగుదేశం నాయకులతో ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అవనిగడ్డ బహిరంగ సభ అనంతరం పవన్‌కల్యాణ్ మచిలీపట్నం చేరుకోనున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశం చేసినందుకే CM జగన్ మళ్లీ రావాలా అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కు ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏపీలో అలజడి సృష్టించి ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి అసలు జగన్ అవసరం ఎందుకని వైకాపా నేతలను ప్రజలు నిలదీయాలని మనోహర్ సూచించారు.
పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర ఏపీ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్‌గా మారింది. మొదటి విడత వారాహి యాత్రలో వ్యక్తులపై రెండో విడతలో వ్యవస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. అటు మూడో విడత యాత్రలో పాల్గొననున్నారు. వైసీపీని గద్దె దించడమే టార్గెట్‌గా పనిచేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com