AP: పింఛన్ల పంపిణీని ఆపాలన్నదే వైసీపీ కుట్ర

AP: పింఛన్ల పంపిణీని ఆపాలన్నదే వైసీపీ కుట్ర
పింఛన్‌ లబ్ధిదారులను ఇరుకునపట్టే ప్రయత్నం.... వైసీపీ ఆదేశాల మేరకే నిర్ణయాలు

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదని వైసీపీ కుట్ర. ఈ పరిస్థితికి కారణం తెలుగుదేశం అని విషం చిమ్మే ప్రయత్నం. సీఎం కార్యాలయంలో నంబర్‌ 1గా వెలిగే ధనుంజయరెడ్డి కనుసన్నల్లోనే ఈ కుట్ర సాగింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కలెక్టర్లు చెప్పినా జగన్‌ కేసులో సహనిందితుడైన సెర్ప్‌ సీఈవో మురళీధరరెడ్డి అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కూడా వంతపాడారు. అంతా కలిసి పింఛనుదారులను ఇక్కట్ల పాలు చేసే నిర్ణయానికే మొగ్గుచూపారు. వైసీపీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలను శిరసావహిస్తూ దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, వీల్‌ఛైర్‌లో ఉన్న వారు మినహా మిగతా పింఛనుదారులందరూ సచివాలయాల వద్దకే వచ్చి పింఛను తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులిచ్చారు.


సీఎస్‌ జవహర్‌రెడ్డి పాలనా విభాగాధిపతి. ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉత్పన్నమయినప్పుడు. వారికి సానుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ప్రజలకు మేలుచేసే నిర్ణయం చేయకుండా వింత వాదనలను ఆయన తెరమీదకు తెచ్చారు. మొత్తం పింఛనుదారులు 65లక్షల 92 వేల మంది ఉంటే వారిలో ఇంటి వద్దకే పంపిణీ చేసే పింఛనుదారుల సంఖ్య 8లక్షల 60 వేలే. అంటే మొత్తం పింఛనుదారుల్లో ఇది 13 శాతమే. ఇక సచివాలయాల దగ్గరకే రప్పించే పింఛనుదారుల సంఖ్య 56లక్షల 91 వేల మంది. వీరి సంఖ్య మొత్తం పింఛన్లలో 86.33 శాతం. ఇంతమందిని సచివాలయాల దగ్గరకు రప్పించడమంటే.. దీనికి తెలుగుదేశమే కారణమని చూపించేందుకు వైసీపీ అమలు చేస్తున్న కుట్రకు సహకరించడం కాక మరేంటనే ప్రశ్న వినిపిస్తోంది. పింఛన్ల పంపిణీపై సోమవారం సీఎస్‌ అధ్యక్షతన జిల్లా కలెక్టర్లతో సమావేశం జరిగింది.

అందులో అత్యధిక శాతం కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయొచ్చని స్పష్టంగా చెప్పారు. అయితే సెర్ప్‌ సీఈవో మురళీధరరెడ్డి వైసీపీ అమలు చేయాలనుకున్న కుట్రకు అనుకూల వాదనే వినిపించారు. మొత్తానికి పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసే నిర్ణయాన్ని కలెక్టర్లకే వదిలిపెడుతూ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగానే సవరించిన ఉత్తర్వులు జారీ చేయాలని సెర్ప్, గ్రామ, వార్డు సచివాలయ శాఖలను సీఎస్‌ ఆదేశించారు. ఇక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో మురళీధరరెడ్డి చక్రం తిప్పినట్టు తెలిసింది. పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను అందించాలనే విధంగా తయారు చేసిన ఆదేశాలను తిరిగి సవరించి.... వైసీపీకి అనుకూలంగా మార్చేందుకు తీవ్ర కసరత్తు జరిగింది.ఇందులో మురళీధరరెడ్డితో పాటు ఏపీ పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కూడా భాగస్వాములయ్యారు. ఆయనే సెర్ప్‌ కార్యాలయానికి వెళ్లి మురళీధరరెడ్డితో ఏకాంతంగా భేటీ అయ్యారు.

చివరకు కలెక్టర్లు ఇచ్చిన సూచనలన్నీ పక్కనపెట్టి. వైసీపీకు మేలు జరిగేలా ఉత్తర్వులిచ్చారు. పింఛను పంపిణీని పర్యవేక్షణ చేయాల్సింది.. గ్రామ, వార్డు సచివాలయశాఖ. ఇళ్ల వద్దనే అందించేందుకు సరిపడా ఉద్యోగులు ఉన్నారా? లేదా అనేది..ఆ శాఖే చూసుకుంటుంది. జిల్లాల్లో ఇళ్ల వద్ద పంపిణీ సాఫీగా జరిగేలా చూసుకునేందుకు కలెక్టర్లు ఉన్నారు. వారంతా ఇళ్ల వద్ద పంపిణీకి సుముఖత వ్యక్తం చేసినా మురళీధరరెడ్డికి, శశిభూషణ్‌కుమార్‌కు వచ్చిన ఇబ్బందేంటి అనేది ప్రశ్న. ఇది కచ్చితంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడమే అని స్పష్టమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story