AP: ఏపీలో కలకలం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

AP: ఏపీలో కలకలం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌
వైసీపీ నుంచి బయటకు వచ్చిన నేతల ఆరోపణలు.... ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం అంతా సాధారణ స్థితి

తెలంగాణ మాదిరిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ కూడా ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్టుగా అనుమానాలు రేగుతున్నాయి. వైసీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ నేతలు స్వయంగా ఇది బయటపెట్టడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది. జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచే మంత్రులు, ప్రజాప్రతినిధులు, IAS, IPS అధికారులు అంతా సాధారణ ఫోన్ కాల్స్ నుంచి ఎన్ క్రిప్టెటెడ్ విధానంలోకి మారిపోవటమే దీనికి ఉదాహరణ. గోప్యంగా ఉండాల్సిన ఫోన్ మాటలు ఎవరో వింటున్నారన్న అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇన్నాళ్లు వీరంతా వాట్సప్ కాల్స్ లేదా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ విధానంలోని కాల్స్ ద్వారానే సంభాషించిన పరిస్థితి. అసలు ఫోన్లు చేస్తేనే భయపడిపోయేంతగా పరిస్థితి మారిపోయింది.


ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం అంతా సాధారణ స్థితికి వచ్చారు. కుటుంబసభ్యులతో మనసారా మాట్లాడు కోవడానికి కూడా భయపడేలా కనిపించని నిర్బంధ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ప్రభుత్వం మారిన గంటల వ్యవధి లోనే.. ఒక్కసారిగా స్వేచ్ఛ లభించినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ఊపిరి పీల్చుకుని సాదారణ కాల్స్‌ను ఏ భయమూ లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కానీ ఐదేళ్ల వైకాపా పాలనలో ఎవర్ని కదిలించినా తమ ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే కలవరమే. ఏదైనా సమావేశంలో నలుగురు IAS, IPS అధికారులు కలిసినా పొడిపొడిగా మాట్లాడుకోవాల్సిందే. ఎవరు వింటున్నారో ...వెంటాడుతున్నారో అనే అనుమానమే. కార్యాలయానికి వచ్చిన వారితో మాట్లాడాలన్నా భయమే అందర్నీ వెంటాడింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో...అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతల ఫోన్లను ఇష్టారాజ్యంగా ట్యాప్ చేశారనే ఆందోళనలు వెల్లువెత్తాయి. ఏపీ హైకోర్టులోని న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. వైకాపాలోని ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన IPS అధికారి సారథ్యంలో ట్యాపింగ్ చేశారని, దీనిపై సీబీఐ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ 2020లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వైకాపాలో పనిచేసిన మాజీ నేతలు నేరుగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి, మాజీ వైకాపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపణలు సంచలనంగా మారాయి. తెలంగాణా తరహాలోనే ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన బాంబు పేల్చారు. వైకాపా ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగందని ఆరోపించారు. ఏపీలో ఉన్న ప్రముఖ నాయకుల ఫోన్లు అన్నీ ట్యాప్ చేశారని ఆయన ఆరోపణలు చేశారు. ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లు, వ్యక్తిగత సమాచారాన్ని రికార్డు చేశారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే కొందరిపై ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందన్నది డొక్కా చేసిన ఆరోపణలు ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టింస్తోంది.

Tags

Next Story