Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై మోదీ, అమిత్ షా ఆరా
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై సమీక్షించారు. వరదల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్‌రెడ్డి.. అమిత్ షాకు వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో చేపట్టిన వరద సహాయక చర్యలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హోం మంత్రికి వివరించారు.ఎన్డీఆర్‌ఎఫ్ ద్వారా పవర్ బోట్లు పంపాలని కోరారు. అవసరమైన మేరకు సాయం చేస్తామని, హోంశాఖ కార్యదర్శి ద్వారా తక్షణ సాయం అందేలా చూస్తామని అమిత్ షా తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలు, వరద పరిస్థితులు, వాటిల్లిన నష్టంపై అడిగి తెలుసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై సీఎం.. ప్రధానికి వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు.వరదల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించేందుకు హెలికాప్టర్లను పంపిస్తామని ఈ సందర్భంగా ప్రధాని హామీ ఇచ్చారని సీఎంవో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారని సీఎంవో ప్రకటనలో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com