Dhulipala Narendra : ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట

Dhulipala Narendra :  ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట
హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్‌

గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలోకి పోలీసులు వెళ్లేందుకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏలూరుకు చెందిన పుసులూరి రాము, మరికొందరిపై. ఈ నెల 15న డెయిరీ వద్ద దాడి జరిగినట్లు పోలీసు కేసు నమోదైంది. ఇందులో ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి వడ్లమూడిలోని సంగం డెయిరీలోకి పోలీసులు వెళ్లేందుకు ఉదయం చేసిన ప్రయత్నం... ఉద్రిక్తతకు దారితీసింది. కేసు విచారణ కోసం వచ్చినట్లు పోలీసులు చెప్పగాసెర్చ్ వారెంట్‌ లేకుండా లోపలకు అనుమతించేది లేదని డెయిరీ ఉద్యోగులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో డెయిరీ సిబ్బంది, పోలీసుల మధ్య 2 గంటల పాటు వాగ్వాదం నడిచింది. ఒక దశలో పోలీసులు బలవంతంగా లోపలికి వెళ్లేందుకు యత్నించినా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల సాధ్యం కాలేదు. ఇది తెలుసుకున్న పాడి రైతులు డెయిరీ వద్దకు వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ నెల 15న గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ వద్ద ఘర్షణ జరిగింది. పాల బకాయిలు చెల్లించాలని అడిగేందుకు కొందరు పాడి రైతులు డెయిరీ వద్దకు రాగా, అక్కడ ఘర్షణ చోటుచేసుకుందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

15 మందిపై కేసు నమోదు కాగా, అందులో 14వ నిందితుడిగా టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. దాంతో ధూళిపాళ్ల సహా ఈ కేసులో ఉన్నవారు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం ధూళిపాళ్లకు, ఇతరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

పోలీసుల తీరుపై సంగం డెయిరీ డైరెక్టర్లు మండిపడ్డారు. తమ ఛైర్మన్‌పై హత్యాయత్నం కేసు మోపడం దారుణమన్నారు. సంగం డెయిరీ ఎవరికీ బకాయిలు పడలేదన్నారు. రాము అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు.

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నరేంద్రపై కేసులు పెట్టారని గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. దీనివెనుక స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్రమేయం ఉందని ఆరోపించారు. నరేంద్రపై వైకాపా పెడుతున్న తప్పుడు కేసులు, నిర్బంధాలు, దాడులను నారా లోకేష్‌ తీవ్రంగా ఖండించారు. సంగం డెయిరీ కబ్జాకు అడ్డుపడిన నరేంద్రపై సీఎం జగన్‌ కక్షకట్టారని లోకేష్‌ ధ్వజమెత్తారు.

Tags

Read MoreRead Less
Next Story