Anantapur: చంద్రబాబు, లోకేష్‌పై పోలీసు కేసు నమోదు..

Anantapur: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మాజీ సీఎం చంద్రబాబుతోపాటు నారా లోకేష్‌పై కేసు నమోదైంది. వైసీపీ నేత కొంగర భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో ఇద్దరిపైన ఐపీసీ సెక్షన్ 153A, 34 కింద కేసు నమోదు చేశారు. ఈనెల 15న స్త్రీ, శిశుసంక్షేమ మంత్రి ఉషశ్రీచరణ్ ర్యాలీ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ పెట్టిన ట్వీట్లపై వైసీపీ నేత భాస్కర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు.
మంత్రి ర్యాలీ కోసం ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడంతో వైద్యం అందక.. ఓ బాలిక చనిపోయిందంటూ ఇద్దరూ అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. ప్రజలకు, పోలీసులకు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా.. చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని వారిపై కేసు పెట్టాలని కోరారు. దీంతో.. ఇద్దరిపైన కేసు బుక్ చేశారు పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు తనపైన కేసులు పెట్టడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పిరికివాడివేంటి జగన్‌రెడ్డీ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్నిస్తే కేసులు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. ఇప్పటికే తనపై హత్యాయత్నంతోపాటు 11 కేసులు పెట్టారని వాటికి ఇంకోటి కలిసిందని అన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయమంటే కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టారని, ఇక తనపై రౌడీషీట్ ఓపెన్ చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com