JAGAN: జగన్‌పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం

JAGAN: జగన్‌పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం
20 మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఆధారాల కోసం అన్వేషణ

ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో 20 మందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఇందులో ఆరు బృందాలు పనిచేస్తున్నాయి. లా అండ్‌ ఆర్డర్‌, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సభ్యులుగా ఉన్న ఈ బృందాలు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. ముందుగా సీఎంపై దాడి జరిగిన ఘటనా ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించారు. ఘటన అనంతరం అర్ధరాత్రి దాటాక నగర సీపీ కాంతిరాణా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసు అధికారులతో కలిసి పరిసరాలను నిశితంగా గమనించారు. ఎటు వైపు నుంచి దాడి జరిగి ఉండవచ్చన్నది పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న జనం ఎవరైనా సెల్‌ఫోన్లతో చిత్రీకరించి ఉన్నారేమే అని ఆరా తీయాలని ఆదేశించారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు, ఒకటి, రెండు రోజుల్లో కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు కమిషనర్‌ చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో ఒక రౌడీషీటర్‌ ఉన్నట్లు తెలిసింది.


డాబాకొట్ల రోడ్డులో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించి పరిశీలిస్తున్నారు. ఆ మార్గంలో రెండు చోట్ల మినహా ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. ఓ స్తంభానికి ఉన్న మూడు ప్రైవేటు సీసీ కెమెరాలు, పోలీసు శాఖకు చెందిన పీటీజడ్‌ కెమెరాలోని ఫుటేజీని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నిక్షిప్తమైన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. అనుమానితులు, అసాంఘిక శక్తుల కదలికలను పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో విద్యుత్తు సరఫరా ఆపేయడంతో అంతా చీకటిగా ఉండి దర్యాప్తునకు అడ్డంకిగా మారింది. ఘటనా స్థలికి పక్కనే ఉన్న ప్రైవేటు పాఠశాల వైపు నుంచి వచ్చిన రాయి తొలుత సీఎం జగన్‌కు, తర్వాత మాజీ మంత్రి వెల్లంపల్లికి తగిలిందని పోలీసులు చెబుతున్నారు. ఆ పాఠశాలపై ఓ కానిస్టేబుల్‌ను రూఫ్‌టాప్‌ సెక్యూరిటీగా ఉంచారు. అయినా చీకటి కారణంగా ఎవరు రాయి విసిరారో కనిపెట్టలేని పరిస్థితి. ఆ పాఠశాలలోకి ఆగంతకులు వెళ్లి ఉంటారనే అనుమానంతో పోలీసులు పాఠశాలకు చెందిన రెండు సీసీ కెమెరాల్లో దృశ్యాలు పరిశీలిస్తున్నారు. పాఠశాలకు, రామాలయానికీ మధ్య ఉన్న ప్రాంతం నుంచి రాయి విసిరినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వెనుక ఉన్న స్టేడియం నుంచి కూడా పాఠశాలలోకి ప్రవేశించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జగన్‌పై దాడిలో విసిరినది రాయా? లేక ఎయిర్‌గన్‌ ఉపయోగించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. పక్షులను కొట్టే క్యాట్‌బాల్‌ను వాడారా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.కదులుతున్న వ్యక్తిని క్యాట్‌బాల్‌తో కొట్టడం సాధారణ వ్యక్తికి సాధ్యమా అని కూడా అనుమానిస్తున్నారు. ఎయిర్‌గన్‌ వినియోగించి ఉండొచ్చని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమీప ప్రాంతంలో కొందరి నుంచి పోలీసులు ఆదివారం వివరాలు సేకరించారు.


డాబాకొట్ల రోడ్డు ప్రాంతంలోని సెల్‌ టవర్ల నుంచి పోలీసులు డంప్‌ తీసుకుని విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతంలోని ఇన్‌కమింగ్‌, ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ వివరాలను తెప్పించి, వాటిని వడపోస్తున్నారు. అనుమానాస్పదంగా ఉండే కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఒకే నంబరు నుంచి ఎక్కువసార్లు వెళ్లిన ఫోన్లపై దృష్టి పెట్టారు. గ్రూప్‌ కాల్స్‌పైనా కన్నేసి ఉంచారు. ఇద్దరు, ముగ్గురు కలిసి కాన్ఫరెన్స్‌కాల్‌లో మాట్లాడుకునే అవకాశం కూడా ఉండవచ్చనే కోణంలో పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లిన దర్యాప్తు అధికారులు ఘటన జరిగిన తీరును తెలుసుకునేందుకు అక్కడ సీన్‌ రీకన్‌స్ట్రక్ట్‌ చేశారు. రాయి తగిలిన ప్రాంతానికి వచ్చిన తర్వాత.. సీఎం ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయి ఎటు నుంచి వచ్చి తగిలింది? నిందితులు ఎక్కడ ఉండి దాడి చేసి ఉండొచ్చు అన్న అంశాలను పరిశీలించారు.

ముఖ్యమంత్రి జగన్‌పై రాయి విసిరిన ఘటనకు సంబంధించి నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా నుంచి ఎన్నికల సంఘం నివేదిక కోరింది. ఈ మేరకు ఏం జరిగింది? ఘటన ఎలా జరిగింది అన్న అంశాలతో పోలీసు కమిషనర్‌ తన నివేదికను ఎన్నికల సంఘానికి పంపించారు. విద్యుత్తు తీగలు తగిలే అవకాశం ఉందన్న కారణంగా సీఎం జగన్‌ రోడ్‌షో సందర్భంగా మార్గంలో విద్యుత్తును నిలిపివేసినట్లు పేర్కొన్నారు. డాబాకొట్ల రోడ్డులో శనివారం రాత్రి 8న్నర గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి విసిరిన రాయి కారణంగా జగన్‌కు నుదుటిపై గాయం అయిందనీ, దర్యాప్తును వేగవంతం చేశామనీ, నిందితులను పట్టుకునే పనిలో ఉన్నామని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

Tags

Next Story