PROTETS: బాబుకు మద్దతుగా అదే నిరసన హోరు

PROTETS: బాబుకు మద్దతుగా అదే నిరసన హోరు
బాబు ఆరోగ్యం కుదుటపడాలంటూ ప్రార్థనలు, హోమాలు, పూజలు

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా టీడీపీ నేతలు, శ్రేణులు ధర్నాలతో హోరెత్తించాయి. చంద్రబాబు ఆరోగ్యం మెరుగుపడాలంటూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. మాజీ ఎంపీ కొనకళ్ల ఇందులో పాల్గొన్నారు. జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపులు మాని వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురంలోని శ్రీనివాసనంద సయూమి ఆశ్రమంలో హోమం నిర్వహించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ పాల్గొన్నారు.


విజయవాడ గుణదల మేరీ మాత గుడిలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన 200 మంది క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థన చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంకెళ్లు వేసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. వైసీపీ చేసే ప్రతి చర్యకూ ప్రతి చర్య ఉంటుందనే విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. కృష్ణా జిల్లా నాగాయలంక గంగానమ్మ ఆలయంలో మండలి బుద్ధప్రసాద్ చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే మంత్రులు, వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


బాపట్ల జిల్లా వల్లాపల్లి నుంచి బల్లికురవలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 8వ రోజు సైకిల్ యాత్ర చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో వైసీపీ పతనాన్ని కోరితెచ్చుకుందని మండిపడ్డారు. పర్చూరు నుంచి కోటప్పకొండ వరకు టీడీపీ శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ చేశాయి. బొమ్మలకూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేశారు. వినాయక ఆలయంలో పూజలు చేశారు. అన్నంబొట్ల వారిపాలెం, పసుమర్రు, చిలకలూరిపేట, మద్దిరాల మీదుగా బైక్ ర్యాలీ సాగింది. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి సీతారామ ఆలయంలో పూజలు చేశారు. ముత్యాలమ్మ ఆలయంలో 300 గుమ్మడి కాయలు కొట్టారు. అన్నమయ్య జిల్లా చిట్వేలులో టీడీపీ, జనసేన నేతలు సత్యమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. చిట్వేల్ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి తిరుమలకు చేపట్టిన తెలుగుదేశం నాయకుల సైకిల్‌ యాత్ర నెల్లూరు జిల్లా సంగం చేరింది. స్థానిక నాయకులు వారికి స్వాగతం పలికారు.

చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శంకర్ గుప్తంలోని చర్చిలో ప్రార్థనలు చేశారు. ఆలమూరు మండలం మడికిలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఇంటింటికి వెళ్లి బాబుకు మద్దతివ్వాలని కరపత్రాలు పంచారు.

Tags

Next Story