TDP PROTESTS: తీవ్రరూపం దాలుస్తున్న ఆందోళనలు

TDP PROTESTS: తీవ్రరూపం దాలుస్తున్న ఆందోళనలు
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఎగిసిపడుతున్న నిరసనలు.. సైకో పోవాలి సైకిల్‌ రావాలని నినాదాలు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ అభిమానులు వినూత్న నిరసనలు చేస్తున్నారు. చంద్రబాబు త్వరగా బయటికి రావాలని కోరుతూ శ్రేణులు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె మండలం మోర్తోట వద్ద కృష్ణానదిలో... తెదేపా శ్రేణులు జలదీక్ష చేపట్టాయి. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ అద్దంకిలోని మాధవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. NTR జిల్లా చందర్లపాడులో శ్రేణులు చంద్రబాబు చిత్రపటానికి దిష్టి తీశారు. తర్వాత మసీదులో ప్రార్థనలు చేశారు. చంద్రబాబుకు మంచి జరగాలని కోరుతూ కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు.


నెల్లూరులోని రాజరాజేశ్వరీ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు త్వరగా విడుదలవ్వాలని కోరుతూ.... శ్రీ కాళహస్తీశ్వర ఆలయం వద్ద కార్యకర్తలు టెంకాయలు కొట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం వద్ద చేతిలో కర్పూరం వెలిగించుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు బయటికి రావాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టారు. చంద్రబాబు త్వరగా బయటికి రావాలని కోరుతూ సత్యసాయి జిల్లా హిందూపురంలోని సుగురు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆర్‌. అనంతపురంలోని ఒడిసెలమ్మకు 108 కుండల పసుపు నీళ్లతో అభిషేకం చేశారు.


కర్నూలు జిల్లా పత్తికొండ మండలం రామచంద్రపురంలో నీటి కుంటలోకి దిగి... నిరసన తెలిపారు. ఎమ్మిగనూరులో చంద్రబాబు మాస్కులు ధరించిప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ... నిరసన తెలిపారు. ఆదోనిలో దీక్షా శిబిరం నుంచి పాదయాత్రగా.... అభయాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి... ప్రత్యేక పూజలు చేశారు.


తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో దీక్షా శిబిరం వద్ద మద్యం సీసాలు కట్టి.... సైకో పోవాలి, సైకిల్‌ రావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. రంగంపేట మండలం చండ్రేడులో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. కాకినాడలో మహిళలు ప్లకార్డులు పట్టుకుని, నల్ల బెలూన్లు గాల్లోకి ఎగరువేసి నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో శెట్టిబలిజలు దీక్ష చేపట్టి... సర్వమత ప్రార్థనలు చేశారు. చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ... విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, RCM చర్చి, దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో చంద్రబాబు కోసం రక్తం... అంటూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.


Tags

Next Story