TDP: పులివర్తి నాని నిరాహార దీక్ష భగ్నం

చంద్రగిరిలో తెలుగుదేశం నేత పులివర్తి నాని చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఓట్ల అక్రమాలపై నిరసనగా పులివర్తి నాని ఆమరణ దీక్షకు కూర్చోగా పోలీసులు భగ్నం చేశారు. అడ్డుకోబోయిన కార్యకర్తలు, నాయకులను ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేసి పులిపర్తి నానిని బలవంతంగా తరలించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో దొంగ ఓట్లపై తెలుగుదేశం నేత పులివర్తి నాని చేపట్టిన నిరాహార దీక్షను కుట్రపూరితంగా భగ్నం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో భారీగా బోగస్ ఓట్లను తొలగించకుండా..MLA చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని నాని ఆరోపించారు. నిన్న ఉదయం దీక్ష చేపట్టిన పులివర్తి నాని ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలలుగా తాను, పార్టీ నాయకులతో కలిసి పోరాటం చేస్తున్నా.. అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఆర్డీవో, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఆధారాలు సమర్పించినా..చర్యలు తీసుకోలేదన్నారు.
సోమవారం ఉదయం నుంచి జోరువానలోనూ..తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద పులిపర్తి నాని దీక్ష కొనసాగింది. ఈ విషయం గమనించిన వైసీపీ నాయకులు.. పక్కనే దళితులతో పోటీ ఆందోళన చేయించారు. రెచ్చగొట్టే నినాదాలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు.. ఇదే అదనుగా దీక్ష భగ్నానికి యత్నించారు. దీనిపై ఆగ్రహించిన పులివర్తి నాని... శరీరంపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు. పోలీసులు దగ్గరకు రాకుండా..నాయకులు, కార్యకర్తలు..పులివర్తి నానీని చుట్టుముట్టారు. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు.. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లి... వ్యాన్లలో పడేశారు. ఆ తర్వాత పులివర్తి నానీని.. బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కిడి... దీక్షా శిబిరం నుంచి తరలించారు.
ఓటర్ల జాబితాపై ఇంత నిర్లక్ష్యమా..? అని పులివర్తి నాని ప్రశ్నించారు. బోగస్ ఓట్ల నమోదుకు సహకరిస్తున్న కొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 7నెలలుగా పోరాడుతున్నా పట్టించుకోకపోవడం ఏమిటని పులివర్తి నాని మండిపడ్డారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచనలతో భారీగా బోగస్ ఓట్లు నమోదు అవుతున్నాయన్నారు. అధికారులు ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలని కోరారు. ఆధారాలు సమర్పించి చర్యలు తీసుకోండి మహాప్రభో అంటున్న స్పందన కరువైందన్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దొంగ ఓట్లు సృష్టించారని పులివర్తి నాని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో భారీగా టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడమే కాకుండా దొంగ ఓట్లను చేర్చారని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పులివర్తి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. బోగస్ ఓట్లపై తిరుపతి ఆర్డీఓను కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మళ్లీ దొంగ ఓటర్ల ప్రక్రియ ప్రారంభించారని.. స్వయంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కార్యాలయంలో దొంగ ఓటర్లను నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ సమయంలో ఎవ్వరిని బయటకు రానివ్వకుండా ఎమ్మెల్యే పిఆర్వో భాస్కర్ నాయుడు ఈ తతంగాన్ని నడిపించారని.. భాస్కర్ నాయుడు పై ఎసిబి కేసులు ఉన్నా పిఆర్వో గా నియమించుకుని కుట్రలు పన్నారని పులివర్తి నాని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com