శాసనసభలో నవ్వులు పూయించిన రఘురామకృష్ణరాజు, విష్ణుకుమార్‌రాజు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సరదా సంభాషణలు, చమత్కారాలతో ఆహ్లాదకరంగా సాగాయి. ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజులు చేసిన చలోక్తులు సభలో నవ్వులు పూయించాయి. జీఎస్‌టీ సంస్కరణలపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఎక్కువ సమయం మాట్లాడారు. ఆయన తర్వాత మాట్లాడేందుకు సిద్ధమైన జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను ఉద్దేశించి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ‘‘శ్రావణ్‌కుమార్‌ను ఆదర్శంగా తీసుకోవద్దు’’ అంటూ చమత్కరించడంతో సభలో నవ్వులు విరిశాయి.
విష్ణుకుమార్‌రాజు వ్యంగ్యం. బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. జీఎస్‌టీ సంస్కరణల్లో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర చేశారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. టీడీపీ పార్టీ గుర్తు అయిన సైకిల్‌పై పన్ను 12శాతం నుంచి 5శాతానికి తగ్గించారని, అయితే ఇతర వాహనాలపై పన్ను 28శాతం నుంచి 18శాతానికి మాత్రమే తగ్గిందని గుర్తుచేశారు. ‘‘సైకిల్‌పై ప్రేమతోనే ఇలా చేశారా?’’ అని చమత్కరించడంతో సభలోని సభ్యులు ఆశ్చర్యంతో విష్ణుకుమార్‌రాజు వైపు చూశారు.
దక్షిణాది వంటకాలపై పన్ను తగ్గించాలని విజ్ఞప్తి: జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఇడ్లీ, దోశ, వడ వంటి దక్షిణాది వంటకాలపై ప్రస్తుతం విధిస్తున్న 5శాతం పన్నును పూర్తిగా తొలగించాలని కోరారు. చపాతి, పరోటా, పన్నీరుపై పన్ను తొలగించినప్పుడు ఇడ్లీ, దోశ, వడపై పన్నును జీరో చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై రఘురామకృష్ణరాజు స్పందిస్తూ, కొణతాల రామకృష్ణ చక్కని సూచన చేశారని అభినందించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com