AP: వినిపించిందా రాజా...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తలైవా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వస్తున్న రజనీకాంత్ ఢిల్లీ విమానాశ్రయంలో ఉండగా అక్కడికొచ్చిన బాలశౌరి గతంలో ఉన్న పరిచయంతో ఆయనను పలకరించారు. ఈ సందర్భంగా బాలశౌరితో రజినీకాంత్ వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేనలో చేరి మంచి పని చేశారని బాలాశౌరీతో రజినీకాంత్ అన్నారు. జనసేనలో చేరి మంచి పనిచేశారని.. పవన్ కల్యాణ్ మంచి నాయకుడు అవుతారని రజినీకాంత్ ప్రశంసించారు. ఈ ప్రశంసతో జనసేన శ్రేణులు ఉబ్బితబ్బిబవుతున్నాయి. పవన్ రాజకీయాలను శాసిస్తున్నారని... భవిష్యత్తులో ఈ ప్రభంజనం మరింత ఎక్కువగా మారుతుందని పవన్ అభిమానులు అంటున్నారు.
అర్థమైందా రాజా
గతంలో తమను తిట్టిన వైసీపీ మంత్రులంతా ఓడిపోయారని రజనీకాంత్‌కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చెప్పారు. గతంలో మీరు చంద్రబాబును పొగిడినప్పుడు వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో మిమ్మల్ని తిట్టారని... ఈ ఎన్నికల్లో వారంతా ఓడిపోయారని బాలశౌరీ వివరించారు. దీంతో రజనీకాంత్ చిరునవ్వుతో ‘మనకు నచ్చింది మనం మాట్లాడతాం.. దానికే తిడితే ఎలా అలా తిట్టకూడదు కదా అని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్.. తన మిత్రుడైన చంద్రబాబును ప్రశంసిస్తూ మాట్లాడారు. చంద్రబాబును పొగడటాన్ని తట్టుకోలేని అప్పటి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, రోజా తదితరులు రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com