రామతీర్థం ఘటనలో కొత్త డ్రామాకు తెరతీస్తున్న విజయసాయిరెడ్డి!

రామతీర్థం ఘటనలో కొత్త డ్రామాకు తెరతీస్తున్న విజయసాయిరెడ్డి!

రామతీర్థం ఘటనలో సరికొత్త డ్రామాకు తెరతీస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇవాళ రామతీర్థం క్షేత్రానికి చంద్రబాబు వస్తున్నారని తెలిసీ.. చంద్రబాబు కంటే గంట ముందే రామతీర్థానికి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు విజయసాయి రెడ్డి. ఘటన జరిగి నాలుగు రోజులు దాటుతున్నా.. పైపై మాటలే తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. సడెన్‌గా చంద్రబాబు వస్తున్నారని తెలిసి.. అకస్మాత్తుగా ట్రిప్‌ ప్లాన్ చేసుకున్నారు విజయసాయిరెడ్డి. ఇదంతా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడానికి, వివాదాన్ని డైవర్ట్ చేయడానికేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

పైగా రామతీర్థం ఘటన వెనక టీడీపీ వాళ్లే ఉన్నారని చెప్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రామతీర్థానికి చెందిన మాజీ వార్డు మెంబర్లు సూరిబాబు, రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను కూడా అదుపులో తీసుకున్నారు పోలీసులు. రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేసినట్టు ఒప్పుకోవాలని టీడీపీ కార్యకర్తలను హింసిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిన్నటి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

రామతీర్థం ఘటనలో టీడీపీని ఇరికించే కుట్ర జరుగుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాత్రికి రాత్రి స్థానిక టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయడం, నేరం ఒప్పుకోవాల్సిందిగా వారిని హింసిస్తున్నారని బాధిత కుటుంబాలు చెప్పడం చూస్తుంటే.. దీని వెనక పక్కా ప్లాన్ ఉందంటున్నారు టీడీపీ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై వరుస దాడులు జరుగున్నా పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం.. రామతీర్థం ఘటన సందర్భంగా చంద్రబాబు వస్తున్నారని తెలిసీ.. రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.


Tags

Next Story