రామతీర్థంలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఆందోళనకు సిద్ధమైన 21 సంఘాలు

విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆలయంపై దాడికి నిరసనగా హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. రామతీర్థంలో 21 సంఘాలు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ నుంచి ధార్మిక నేతలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. శనివారం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు టూర్‌తో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. హుటాహుటిన మంత్రుల్ని రంగంలోకి దింపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ నేడు రామతీర్థంలో పర్యటించనున్నారు. మంత్రుల పర్యటన, హిందూ సంఘాల ఆందోళన పిలుపుతో రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆలయంపై దాడిని ఖండిస్తూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అటు.. రామతీర్థం ఆలయ ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజు ప్రభుత్వం తొలగించింది. ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు, హిందూ సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీగా బలగాల్ని మోహరించారు. బీజేపీ నేత ఈశ్వర్‌రావు దీక్షను భగ్నం చేసి.. శిబిరం తొలగించారు. ఈశ్వర్‌రావును ఎక్కడికి తరలించారో పోలీసులు వెల్లడించడం లేదు. శనివారం ఆందోళనలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసుల వైఖరికి నిరసనగా విజయనగరం కోట వద్ద బీజేపీ ధర్నాకు పిలుపునిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com