AP: ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు

ఆంధ్రప్రదేశ్‌లో పలు పథకాల పేర్లు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని.. ఈ క్రమంలో సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. గత వైసీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ పేరుతో అమలు చేసిన పథకాలకు మహనీయుల పేర్లు పెడుతున్నామని స్పష్టం చేశారు.
జగనన్న అమ్మ ఒడి పథకాన్ని 'తల్లికి వందనం'గా మార్చారు.జగనన్న విద్యా కానుక - సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర
జగనన్న గోరు ముద్ద - డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం
మన బడి నాడు నేడు - మన బడి - మన భవిష్యత్తు
స్వేచ్ఛ - బాలికా రక్షజగనన్న ఆణిముత్యాలు - అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హర్షణీయమన్న పవన్
ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వివిధ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టడం హర్షణీయమని అన్నారు. సమాజ సేవకులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు. అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ వంటి పేర్లను పెట్టిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో జగన్ అన్నింటికీ తన పేరే పెట్టుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడంతో వారికి సమున్నత గౌరవం ఇచ్చామని చెప్పారు. బడిపిల్లల సామగ్రి పథకానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ, విద్యార్థులకిచ్చే ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆ మహనీయుల ఆశీస్సులు మా ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయని పవన్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com