Ammavodi scheme : అమ్మఒడి పథకంలో రూ.1000 కోత

Ammavodi scheme : అమ్మఒడి పథకంలో మరోసారి కోత పెట్టింది జగన్ సర్కార్.. ఇప్పటికే మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వెయ్యి రూపాయలు కోత పెట్టి 14వేల రూపాయలు మాత్రమే అకౌంట్‌లో వేస్తోంది. ఇప్పుడు మరో వెయ్యి రూపాయలు తగ్గించి 13వేల రూపాయలు మాత్రమే ఇస్తామంటోంది. ఈసారి స్కూళ్లలో మౌలిక సదుపాయాల నిర్వహణ అనే పేరు చెప్పి కోత పెడుతోంది. జగన్ హామీ ఇచ్చినట్టుగా ఇకపై అమ్మ ఒడి డబ్బులు లబ్దిదారుల ఖాతాల్లో పడవు. మొదటి ఏడాది 15వేల రూపాయలు ఖాతాలో వేసిన జగన్.. జూన్ నుంచి కేవలం 13వేల రూపాయలు మాత్రమే విద్యార్ధుల తల్లిదండ్రుల అకౌంట్లలో వేస్తారు.
అమ్మఒడికి మరిన్ని కఠిన ఆంక్షలు పెడుతోంది జగన్ సర్కార్. విద్యార్ధి హాజరు 75 శాతం ఉంటేనే అమ్మఒడికి అర్హులవుతారని తేల్చి చెప్పింది. నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30వరకు అటెండెన్స్ చూసిన తరువాత మాత్రమే అమ్మ ఒడి వేయాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు సమాచారం అందించారు. అసలే అమ్మఒడిని ఆలస్యం చేశారు. గతేడాది జనవరి 11న ఈ పథకం కింద డబ్బులు వేసిన జగన్ ప్రభుత్వం.. ఈ ఏడాది విద్యార్థుల హాజరు పేరుతో జూన్‌కు మార్చారు. దీని వల్ల ఒక ఏడాది అమ్మ ఒడి అందకుండా పోతుందని లబ్దిదారులు చెబుతుతున్నారు.
అమ్మఒడికి రేషన్ కార్డులతో లింక్ పెట్టారు. ఈ మధ్య కాలంలో లక్షల మంది రేషన్ కార్డులను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలా మంది అమ్మఒడి పథకాన్ని కోల్పోయారు. ప్రభుత్వమే రేషన్ కార్డులు తీసేసి, ఇప్పుడు అమ్మఒడికి అర్హత లేదని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని విమర్శిస్తున్నారు. పైగా అమ్మఒడికి, కరెంట్ బిల్లులకు కూడా లింక్ పెట్టారు. దీనివల్ల కొన్ని వేల మంది లబ్దిదారులను అమ్మఒడి పథకానికి దూరం చేసింది ప్రభుత్వం. ఫలానా పథకానికి లబ్దిదారులు అర్హులని గుర్తించి సంక్షేమ పథకం ఇచ్చాక.. మధ్యలో లాక్కోవడం కుదరదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకునే పరిస్ధితుల్లో లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com