ఏపీలో ఇసుక తవ్వకాల బిడ్డింగ్‌పై వివాదం

ఏపీలో ఇసుక తవ్వకాల బిడ్డింగ్‌పై వివాదం
ఓ వైపు మద్యం, మరోవైపు సిమెంట్ వ్యాపారాలతో దోచుకుంటున్న సీఎం.. ఇప్పుడు ఇసుక పేరుతో దోపీడికి సిద్ధమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్రమంతా తీవ్ర ఆందోళన చెందుతుంటే.. దానికంటే ముందే ముఖ్యమంత్రి జగన్ ఇసుక మొత్తాన్ని ప్రైవేటు పరం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో ఇసుక రీచ్‌ల కోసం నిర్వహించిన వేలంలో జేపీ పవర్ వెంచర్స్ బిడ్డింగ్ దక్కించుకోవడం వెనక.. పెద్ద కుంభకోణం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది మరో క్విడ్ ప్రోకో అంటూ ధ్వజమెత్తుతున్నాయి. నష్టాల్లో ఉన్న కంపెనీ ఇసుక రీచ్‌లను ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నిస్తున్నాయి. ఓ వైపు మద్యం, మరోవైపు సిమెంట్ వ్యాపారాలతో దోచుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఇసుక పేరుతో దోపీడికి సిద్ధమయ్యారని మండిపడుతున్నాయి..

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాల టెండర్లను జేపీ గ్రూప్‌లో భాగమైన జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ అనే ప్రైవేటు సంస్థ దక్కించుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు జోన్‌-1గా, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు జోన్‌-2గా, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు కలిపి జోన్‌-3గా విభజించారు. వీటిలో మొత్తం 471 రీచ్‌లలో రెండేళ్లపాటు ఇసుక తవ్వకాలు, విక్రయాలకు టెండర్లు నిర్వహించే బాధ్యత కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించారు. ఆ సంస్థ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో 5 ప్రైవేటు సంస్థలు బిడ్లు వేశాయి. వీటిలో అత్యధికంగా ప్యాకేజీ-1లో 477.5 కోట్లు, ప్యాకేజీ-2లో 745.7 కోట్లు, ప్యాకేజీ-3లో 305.6 కోట్లు.. మొత్తం 1,528 కోట్లు ఇస్తామని జయప్రకాశ్‌ పవర్‌ కోట్‌ చేసి ఎల్‌-1గా నిలిచింది. దీంతో ఈ సంస్థకు మూడు ప్యాకేజీలను ఖరారు చేశారు. ఈ సంస్థ ఏప్రిల్‌ ఒకటి నుంచి రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేపట్టనుంది.

ఇక ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలకు లబ్ధి చేకూరనుందని పంచాయతీ రాజ్‌ ముఖ్యకార్యదర్శి ద్వివేది వెల్లడించారు. ప్రజలు నాణ్యతను పరిశీలించి ఏ రీచ్‌ నుంచైనా సొంత వాహనంలో ఇసుక తీసుకెళ్లొచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్‌ల్లోనూ ఒకే ధర ఉంటుందని.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ లేకుండా నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. అయితే ఏపీలో మొత్తం ఇసుకను ప్రైవేటు సంస్థకు ఎలా ఇచ్చారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నించారు. 3వేల 500 కోట్ల నష్టాల్లో ఉన్న దివాళ సంస్థకు టెండర్లు ఎలా కట్టబెట్టారంటూ మండిపడ్డారు. కాకి లెక్కలు చెబుతున్న.. ఐఏఎస్‌ అధికారి ద్విదేది సిగ్గుతో తలదించుకోవాలన్నారు పట్టాభి. ఇసుక దోపిడిని ద్వివేది సమర్ధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు..ఇసుక రీచ్‌లను కూడా ప్రైవేటుపరం చేస్తారా అంటూ మండిపడుతున్నాయి. ప్రజా సంపదను దోచుకోవడానికే ప్లాన్ చేశారని.. ఇసుక పేరుతో మరో కుంభకోణానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story