YCP: దళితుల మధ్య అంతరం పెంచేలా సీట్ల కేటాయింపా?

YCP: దళితుల మధ్య అంతరం పెంచేలా సీట్ల కేటాయింపా?
జగన్‌ తీరుపై మండిపడుతున్న ఓ వర్గం నేతలు.... ఇదేం న్యాయమంటూ ప్రశ్నించిన మాదిగల సభ

వైసీపీలో ఎస్సీల్లో మాల, మాదిగ సామాజికవర్గాల మధ్య సీట్ల పంపకంపై ఓ వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితుల మధ్య అంతరాన్ని పెంచేలా సీట్ల పంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీల్లో ఒక వర్గం పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రాయలసీమలో 9 ఎస్సీ స్థానాల్లో 7మాల వర్గానికే ఇచ్చారని , మాదిగలకు ఇచ్చిన రెండు సీట్లలో ఇప్పటికే ఒకటి రద్దు చేయగా..రెండోదీ అనుమానమేనని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29శాసనసభ స్థానాల్లో 8 మాత్రమే మాదిగలకు ఇచ్చారని..ఇదేం అన్యాయమంటూ మాదిగల సభ ప్రశ్నించింది.

నా ఎస్సీలు.. నా ఎస్టీలు అంటూ మాట్లాడే సీఎం జగన్.. సామాజిక న్యాయానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు, ఎస్సీలకు తానొచ్చాకే న్యాయం జరిగిందన్నట్లు చెబుతుంటారు. కానీ, చేతల్లో అదే ఎస్సీల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 9 ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఏడింటిని మాలలకు, రెండు మాదిగలకు కేటాయించారు. అనంతపురం జిల్లా మడకశిర, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గాల్లో మాదిగలకు ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు స్థానాల్లో ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, సుధాకర్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా లేదా అన్న స్పష్టత లేదు. రాష్ట్రవ్యాప్తంగా 29ఎస్సీ రిజర్వుడు స్థానాలుంటే గత ఎన్నికల్లో 28 చోట్ల వైసీపీ గెలిచింది. కానీ వారిలో 20మంది ఎమ్మె ల్యేలు మాలలైతే..మాదిగలు 8 మందే ఉన్నారు.


ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగ తరపున గురువారం విజయవాడలో మాదిగ సామాజిక న్యాయసదస్సు నిర్వహించారు. జనాభా ప్రాతిపదికనైనా మాకు న్యాయం చేయరా? అంటూ ఈ సదస్సులో పలువురు అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమలో రెండు ఎస్సీ రిజర్వుడు లోక్ సభ నియోజకవర్గాల్లో మాదిగలకు ఒక్కటీ కేటాయించలేదు. మాదిగలు అధికంగా ఉన్న మెట్ట ప్రాంతాల్లోనూ మాలలకే టికెట్లు ఇస్తున్నారు. శింగనమల, నందికొట్కూరు లాంటి నియోజకవర్గాల్లో మాదిగలే ఎక్కువ. కానీ, అక్కడ ఎమ్మెల్యే టికెట్లు మాలలకే ఇచ్చారని కొందరు నాయకులు విమర్శించారు. గురువారం నాటి సదస్సుకు రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా రావాల్సి ఉన్నా ఆయన రాలేదు. 3గంటలు చూసినా ఆయన రాకపోవడంతో నాయకులు సభను ముగించేసి వెళ్లిపోయారు. ఇటీవల తాడేపల్లిలో నిర్వహించిన ఓ సమావేశంలో సజ్జల పాల్గొన్నారు. అయితే ఆ సమావేశాన్ని మాల ప్రతినిధులే లీడ్ చేశారు. ఆ సభకు వెళ్లిన సజ్జల.. దీనికి రాకపోవడంపై మాదిగ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు హాజరైన ఎంపీ నందిగం సురేష్..వక్తల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story