మున్సిపల్ ఎన్నికల్లో ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ విత్‌డ్రా.. SEC ఆగ్రహం
తిరుపతిలో బాధిత అభ్యర్థులు కేసులు పెట్టేందుకు, ROకి ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఇచ్చారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా చేయించిన ఘటనలపై SEC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా బలవంతపు ఉపసంహరణలు జరగడం క్షమించరానిదిగా పేర్కొన్న SEC.. తిరుపతిలో బాధిత అభ్యర్థులు కేసులు పెట్టేందుకు, ROకి ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి ఘటనలపై విచారణ జరిపాక నిర్ణయం తీసుకుంటామని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న TDP అభ్యర్థిని నామినేషన్.. ఆమెకు తెలియకుండానే విత్‌డ్రా అవడం కలకలం రేపింది. దీనికి ROనే కారణమంటూ ఆమె మండిపడ్డారు దీనిపై పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. తిరుపతి 7వ వార్డు నుంచి విజయలక్ష్మి పోటీ చేశారు. ప్రచారంలోనూ బిజీబిజీగా ఉన్నారు. ఐతే.. అక్రమంగా తన నామినేషన్ విత్‌డ్రా చేసేందుకు కుట్ర జరుగుతున్నట్టు ఆమెకు అనుమానం వచ్చి ROకి ఫోన్ చేశారు. విత్‌డ్రాకి సంబంధించిన ఎలాంటి విషయమైనా తాను ధృవీకరించకుండా నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ఆ కాల్‌ను రికార్డు కూడా చేశారు. తీరా చూస్తే విజయలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించడంతో ఆమె షాక్‌కి గురయ్యారు. భర్త మధుతో కలిసి ROను నిలదీశారు.
YCP వర్గాల ఒత్తిడితోనే తన నామినేషన్ విత్‌డ్రా అయినట్టు ప్రకటించారని విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. తన సంతకం ఫోర్జరీ చేసిన వారిపైన, సరైన ధృవీకరణ లేకుండా నామినేషన్ విత్‌డ్రా అయినట్టు ప్రకటించిన ROపైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అటు, ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించడానికి జరిగిన కుట్రలపై విజయలక్ష్మి భర్త మధు ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని, దానికి మీతోపాటు మీ కుటుంబ సభ్యులు బాధపడాల్సివస్తుందంటూ ROని హెచ్చరించారు.
అటు ఈ ఘటనపై ఎస్‌ఈసీ స్పందించింది. తిరుపతిలో 7 వార్డులో ఫోర్జరీ ద్వారా నామినేషన్ల ఉపసంహరణ జరిగినట్లు తెలుస్తోంది. మీడియాలో సైతం బలవంతపు ఉపసంహరణలపై వార్తలొచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు పాటించనప్పటికీ బలవంతపు ఉపసంహరణలు జరగడం క్షమించరానిదన్నారు. తిరుపతిలో బాధిత అభ్యర్ధులు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టేందుకు, ఆర్‌ఓకు కంప్లైంట్ చేసేందుకు ఎస్‌ఈసీ అవకాశం ఇస్తుందని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేశారు. సదరు వార్డుల నామినేషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. కమీషన్ వద్ద అలాంటి ఫిర్యాదులపై జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ స్వయంగా స్వీకరిస్తారని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పష్టం చేశారు.