Sidharth Luthra: కరుడుగట్టిన నేరగాళ్ల మధ్య చంద్రబాబా

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, కరడుగట్టిన నేరగాళ్ల మధ్య ఆయన్ను జైల్లో ఉంచటం సురక్షితం కాదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా న్యాయస్థానాన్ని కోరారు. జైల్లో చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందనే అనుమానాలు ఉన్నాయని, ఆయన భద్రతపై ఆందోళన ఉందని ఈ నేపథ్యంలో 'హౌస్ అరెస్టు'లో ఉంచేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తరపున విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం లూథ్రా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. చంద్రబాబు వయసు 73 ఏళ్లని తీవ్ర మధుమేహం, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీ కాలంలో హౌస్ అరెస్టులో ఉండేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబును ఆరెస్టు చేసిన కేసుపై ఆయన నివాసంలో ఇప్పటి వరకూ సోదాలు జరగలేదని, అక్కడేమీ సీజ్ చేయలేదని ఈ కేసు దర్యాప్తుతో ఆయన ఇంటికి సంబంధం లేదని ఆయన్ను హౌస్ అరెస్టులో ఉంచటం వల్ల ఆధారాలు మాయమవుతాయనే ఆందోళనే అక్కర్లేదని లూథ్రా వివరించారు. 70 ఏళ్ల మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖను హౌస్ అరెస్టులో ఉంచేందుకు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపున ఏజీ ఎస్.శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. వాదనలు వినిపించారు. CRPCలో జ్యుడిషియల్ కస్టడీ, పోలీసు కస్టడీ మాత్రమే ఉన్నాయి. హౌస్ అరెస్టు అనే మాటే లేదని, ఆ పిటిషన్‌ను తిరస్కరించాలని సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. ఈ పిటిషన్లో సహేతుకత లేదని... వారు చెబుతున్న అంశాలకు ఆధారాలేవీ సమర్పించలేకపోయారని తెలిపారు. చంద్రబాబును హౌస్ అరెస్టుకు అనుమతిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.
నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు దపాలుగా ఇరుపక్షాల న్యాయవాదులు. వాదనలు వినిపించారు. అనంతరం న్యాయాధికారి హిమహిందు తీర్పును నేటికి వాయిదా వేశారు. మరోవైపు కేసుకు సంబంధించిన దస్త్రాలను తమకు సమర్పించాలని కోరుతూ చంద్రబాబు తరపున సిద్దార్ధ లూద్రా పిటిషన్లు వేశారు. CRPC సెక్షన్ 207 ప్రకారం సంబంధిత పత్రాలన్నీ ఇప్పించేలా చూడాలని కోరారు... దీనిపై కొంత సేపు వాదనలు కొనసాగాయి. తుది నిర్ణయం రాలేదు. అటు చంద్రబాబును 5 రోజులపాటు సీఐడీ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com