SIT: కల్తీ నెయ్యి విచారణలో దూకుడు పెంచిన సిట్
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వైనంపై గుంటూరు రేంజీ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మూడు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్న సిట్.. తిరుపతిలో విచారణ జరుపుతోంది. నెయ్యి కొనుగోళ్లు, లడ్డూ తయారీ విధానం, కల్తీని గుర్తించిన విధానంపై సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి నేతృత్వంలోని బృందం విచారణ కొనసాగిస్తోంది. మూడు రోజులు తిరుపతిలోనే ఉండనున్న సిట్.. లడ్డూ కల్తీపై లోతుగా దర్యాప్తు చేయనుంది. ఓ బృందం తమిళనాడు కూడా వెళ్లనుంది. రెండోరోజు సభ్యులంతా సమావేశమై, ఎవరెవరు ఏయే అంశాలు విచారించాలో బాధ్యతలు పంచుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరాకు సూత్రధారులు, పాత్రధారులపై క్రిమినల్ కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. ఏఆర్ డెయిరీకి టెండర్లు అప్పగించడం సహా సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు.
తమిళనాడుకు సిట్
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతమైంది. నేటి నుంచి మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ కొనసాగించనుంది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ ఉన్న తమిళనాడులోని దుండిగల్ వెళ్లి ఓ సిట్ బృందం దర్యాప్తు చేయనుంది. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించనుంది.
టీటీడీ ఈవోతో భేటీ
సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజీ డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజు టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏఆర్ డెయిరీకి టెండర్లు కట్టబెట్టిన వ్యవహారంపై వివరాలు అడిగినట్లు తెలిసింది. నాటి టెండర్‌లో ప్రాథమికంగా ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి? వాటిలో గరిష్ఠ, కనిష్ఠ ధరలపై సరఫరా చేసేందుకు టెండరు వేసిందెవరు వంటి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. గుత్తేదారు ఎంపిక, టెండరు అప్పగింత ఎలా జరిగింది, సరఫరా తీరు ఎలా ఉంది వంటి అంశాలను ఈవో నుంచి సిట్ తెలుసుకుంది. అనంతరం సిట్ అధికారులు ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణను పోలీస్ అతిథి గృహానికి పిలిపించి వివరాలను సేకరించారు. సాధారణంగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాక సాంకేతిక బిడ్లలో అర్హత సాధించేందుకు అవసరమైన ఫైళ్లను అందించారా లేదా అని ప్రశ్నించినట్లు తెలిసింది.
విభిన్న కోణాల్లో దర్యాప్తు: సిట్ చీఫ్ సర్వ శ్రేష్ట త్రిపాఠి
తిరుమల లడ్డులో కల్తీ నెయ్యిపై అందిన ఫిర్యాదులో విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని సిట్ చీఫ్ సర్వ శ్రేష్ట త్రిపాఠి వెల్లడించారు. సిట్ విచారణలో భాగంగా ఆదివారం తిరుపతి పోలీసు గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సిట్ చీఫ్ మాట్లాడుతూ.. లడ్డులో నెయ్యి కల్తీ ఉందని ఫిర్యాదు అందడంతో ఆ కేసును తీసుకుని విచారణ ప్రారంభించామన్నారు. ఈ కేసు ప్రాథమిక దశలోనే ఉందన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com