SKILL CASE: చంద్రబాబు కేసులో సుప్రీంలో వాదనలు ఇవే..

SKILL CASE: చంద్రబాబు కేసులో సుప్రీంలో వాదనలు ఇవే..
కేసులపై కేసులు పెట్టి సర్కస్‌ ఆడిస్తున్నారన్న సిద్ధార్థ లూధ్రా... అలాంటిదేమీ లేదన్న రోహత్గీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది. ఈనెల 17న మధ్యాహ్నం రెండు గంటలకు వాదనలు వింటామని జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసుపై ఇవాళ జరిగిన విచారణలో కూడా ప్రధానంగా 17-A సెక్షన్‌పైనే వాదనలు సాగాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషనపై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.


ఈ విచారణలో చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఏపీ సీఐడీ తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ విచారణలో తొలుత స్కిల్ కేసు విచారణకు ఫైబర్‌నెట్ కేసుతో సంబంధం ఉందని లూథ్రా ప్రస్తావించారు. మరో కేసులో చంద్రబాబును ఈనెల 16న ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు వారెంట్ తీసుకున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపారు. వరుస కేసులు పెట్టి తమను సర్కస్ ఆడిస్తున్నారని లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దశలో ఇక్కడ కూడా 17-Aను సవాలు చేస్తున్నారా అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. అందుకు అవునని సమాధానమిచ్చిన లూథ్రా 17A ప్రతిచోటా వర్తిస్తుందన్నారు.


ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ముకుల్‌ రోహత్గీ 17ఏ అన్నది ఉన్నత పదవుల్లో ఉన్నవారికి రక్షణ ఛత్రం కాకూడదని ఇదే విషయాన్ని చట్టం స్పష్టంగా చెబుతోందని వాదించారు. చట్టాన్ని రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నా..నేరం జరిగినప్పటి చట్టమే వర్తిస్తుందన్నారు. కొత్త చట్టం అమల్లోకి రాకముందే నేరం జరిగినందున.... సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదని వివరించారు. ఈ దశలో అసలు.. ఎంక్వయిరీ విషయంలోనే నిరోధం ఉంటే.... కేసులు ఎలా ఫైల్‌ చేస్తారని జస్టిస్‌ బోస్‌ ప్రశ్నించారు. పోలీసు అధికారికి కేసు నమోదు చేసే అధికారమే లేనప్పుడు కేసు ఎలా నమోదు చేస్తారని అడిగారు. ఇందుకు స్పందించిన రోహత్గీ అధికార విధుల నిర్వహణ ముసుగులో అవినీతికి పాల్పడే పరిస్థితి ఉండకూడదు కదా అని బదులిచ్చారు.

అయితే చట్ట సవరణ తర్వాత FIR నమోదు చేశారు కానీ కేసు పాతదే అంటారా ? అని జస్టిస్‌ త్రివేది అడిగారు. చట్ట సవరణ ముందు కేసు కాబట్టే 17A వర్తించదని రోహత్గీ పునరుద్ఘాటించారు. 17A అన్నది.. అవినీతికి రక్షణ కాకూడదన్నారు. పిటిషనర్‌ తన ప్రమేయం లేదంటున్నారు కదా SLPపై మీరేమంటారని ధర్మాసనం ప్రశ్నించగా నేరమే చేయనప్పుడు SLP ఎందుకు వేశారని రోహత్గీ వాదించారు. నిర్ణయంలో తన ప్రమేయం లేనప్పుడు.. 17ఏ ఎలా వర్తిస్తుందన్న రోహత్గీ 2018 మే 14, జూన్‌ 6 తేదీల్లో ఉన్న పత్రాలను హైకోర్టు ముందుంచినట్టు తెలిపారు. ఈ పత్రాల ఆధారంగా అప్పటికే విచారణ ప్రారంభమైనట్లు హైకోర్టుకు నివేదించామని తెలిపారు. ఈ వాదనల తర్వాత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం ఈనెల 17కు వాయిదావేసింది.

Tags

Read MoreRead Less
Next Story