SC: కోర్టుల్లో రాజకీయ యుద్ధాలు వద్దు
ఓటుకు నోటు కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత మళ్లీ తాజాగా విచారణ జరిపించాలని, కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఆళ్ల దాఖలు చేసిన రెండు కేసులను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్‌కుమార్‌ల ధర్మాసనం కొట్టేసింది. రాజకీయ యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని హితవు పలికింది. ఓటుకు నోటు కేసులో ఆళ్ల బాధితుడు కానీ, సాక్షి కానీ కాకపోయినా 2016లో ఆయన దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని అప్పటికే ఛార్జిషీట్ దాఖలైన కేసులో మళ్లీ పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. వాటిని కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు అదే ఏడాది డిసెంబరు 9న తీర్పిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్‌ను, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్‌నూ డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో వాద, ప్రతివాదుల వాదనలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి తమకు ఎలాంటి కారణం కనిపించలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మళ్లీ దర్యాప్తు జరపాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల వెనుక ఎలాంటి కారణాలు కనిపించలేదని తెలిపింది. అందువల్ల ఆ ఉత్తర్వులను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రెండు ఛార్జిషీట్లు దాఖలైన తర్వాత కూడా పిటిషనర్ ఫిర్యాదు చేశారని... పైగా హైకోర్టుకు వెళ్లకుండా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆళ్ల దాఖలు చేసిన ప్రాథమిక ఫిర్యాదునే కొట్టేసినందున ఇప్పుడు మళ్లీ దీనిపై కసరత్తు చేయక్కర్లేదని తెలిపింది. అందువల్ల ఈ పిటిషన్లను డిస్మిస్ చేయడం మినహా ఎలాంటి వ్యాఖ్యానాలు చేయదలచుకోలేదని జస్టిస్ ఎంఎం సుందరేష్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని తెలంగాణ మాజీ మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాము అదే అంశంపై దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ప్రత్యేకంగా చూడాలని ఆళ్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ‘మీరు ఆ కేసు ఉపసంహరించుకోవాలనుకుంటే చేసుకోండని.. దాని గురించి ఒత్తిడి చేయకండని జస్టిస్ సుందరేష్ సూచించారు. ఆ రిట్ పిటిషన్‌పై ఒత్తిడి తేవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేసినందున దాన్ని డిస్మిస్ చేస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com