AP Assembly : ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly : జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లుతోంది. చర్చకు పట్టుబడుతూ సభను స్తంభింపజేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. దీంతో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, రామానాయుడు, వీరాంజనేయస్వామిలను బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. సమస్యలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారంటూ నిరసనకు దిగారు. ఇక సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు టీడీపీ సభ్యుల్ని బయటకు నెట్టేయాలంటూ మార్షల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు స్పీకర్.ఐతే సభ నుంచి బయటకు వెళ్లేందుకు టీడీపీ సభ్యులు నిరాకరించారు. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందంటూ ప్రశ్నించారు. స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు.
అటు స్పీకర్ ఆదేశాలతో సభలోకి ఎంట్రీ ఇచ్చిన మార్షల్... సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు టీడీపీ సభ్యుల్ని బయటకు లాక్కెళ్లారు. ఐదుగురు సభ్యుల సస్పెన్షత్ సభలోని మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తీరును తప్పుబడుతూ ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై చర్చ చేపట్టాల్సిందే అంటూ పట్టుబట్టారు.
అటు టీడీపీ ఆందోళనలతో ఎట్టకేలకు సభలో జంగారెడ్డిగూడెం ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేసింది. సారా మరణాలపై విచారణకు ఆదేశించామన్నారు మంత్రి ఆళ్ల నాని. నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరామన్నారు. ఐతే జంగారెడ్డిగూడెం ఘటనపై సభలో చర్చ జరగాల్సిందే అంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

