తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎన్నిక

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎన్నిక
తీవ్ర ఉత్కంఠ రేపిన తాడిపత్రి రాజకీయాలకు ఇవాళ్టితో శుభం కార్డు పడింది.

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎన్నికయ్యారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ రేపిన తాడిపత్రి రాజకీయాలకు ఇవాళ్టితో శుభం కార్డు పడింది. తాడిపత్రి మున్సిపాలిటీ వైఎస్‌ ఛైర్మన్‌గా సరస్వతిని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 18 వార్డులు గెలుచుకుంది. వైసీపీకి 14 వార్డులు మాత్రమే దక్కాయి. పైగా తాడిపత్రిలో వైసీపీకి రెండు ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. అయినప్పటికీ సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు టీడీపీకే మద్దతివ్వడంతో తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.

ఫలితాలు వచ్చినప్పటి నుంచి తాడిపత్రిలో ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఎక్స్‌అఫీషియో ఓటు వినిపియోగించుకునేందుకు వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు టీడపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి కూడా అప్లై చేసుకున్నారు. అయితే, ఓటు హక్కు లేనందున ఈ నలుగురికి ఎక్స్‌అఫీషియోలుగా ఓటు వేసేందుకు అర్హత లేదని మున్సిపల్ కమిషనర్‌ తేల్చేశారు. ఎక్స్‌అఫీషియో అవకాశం లేకపోవడంతో వైసీపీ నేతలు బెదిరింపులకు కూడా దిగారంటూ టీడీపీ ఆరోపించింది. తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు టీడీపీ ఏకంగా క్యాంప్‌ ఏర్పాటు చేసుకుంది. టీడీపీ నుంచి గెలిచిన వాళ్లతో సహా సీపీఐ, స్వతంత్ర అభ్యర్ధిని సైతం శిబిరంలోనే ఉంచింది. ఇవాళ్టి ప్రమాణస్వీకారానికి ముందు మాత్రమే కౌన్సిలర్లను బయటకు తీసుకొచ్చారు.

గెలిచిన అభ్యర్ధుల బంధువులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారన్న వార్త తెలియగానే జేసీ అశ్విత్‌ రెడ్డి స్వయంగా బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పారు. తాడిపత్రిలోని మస్తాన్‌ వలీ కుటుంబ సభ్యులు టీడీపీ నుంచి మూడు చోట్ల గెలిచారు. దీంతో వారంతా వైసీపీకే మద్దతివ్వాలంటూ బెదిరించారని మస్తాన్ వలీ కుటుంబం ఆరోపించింది. ఈ కుటుంబానికి టీడీపీ అండగా నిలబడింది. మొత్తానికి ఇన్ని పరిణామాల మధ్య తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంది.



Tags

Read MoreRead Less
Next Story