TDP: దొంగ ఓట్ల అక్రమాలపై.. యాక్షన్‌ ప్లాన్‌

TDP: దొంగ ఓట్ల అక్రమాలపై.. యాక్షన్‌ ప్లాన్‌
ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఓటర్ల జాబితాల అక్రమాలపై టీడీపీ యుద్ధం ప్రకటించింది.

ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఓటర్ల జాబితాల అక్రమాలపై టీడీపీ యుద్ధం ప్రకటించింది. జాబితాల్లో అక్రమాలను వెలికితీసి ప్రక్షాళన చేయడానికి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించింది. దాని అమలు కోసం నేతల్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక తర్వాత ఓటర్ల జాబితాల అక్రమాలపై టీడీపీ దృష్టి కేంద్రీకరించింది. తర్వాత కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే తరహా అనుభవం ఎదురుకావడంతో మరింత అప్రమత్తమైంది. ఓటర్ల జాబితాల్లో చేర్చిన దొంగ ఓట్లు, అడ్డగోలుగా ఓట్ల తొలగింపు వంటి వాటిని వెలికితీయడంపై ఆరు నెలలుగా పని చేస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక సెల్‌ ఏర్పాటు చేసి నిరంతరం నియోజకవర్గ నేతలతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కచ్చితంగా ఇంటింటి సర్వే చేయించాలని ఇన్‌చార్జులను ఆదేశించారు. అధినేతే స్వయంగా రంగంలోకి దిగడంతో నేతలు కూడా యాక్టవ్ అయ్యారు. నియోజకవర్గమంతా సర్వేలు చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఇంటింటి సర్వే పనిని టీడీపీ నేతలు పూర్తిగా ఒక ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి చేయిస్తున్నారు. 60శాతం లోపు పని జరిగిన నియోజకవర్గాలను గుర్తించి కొద్ది రోజుల క్రితం వాటి ఇన్‌చార్జులతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ప్రజలు మనతోనే ఉన్నారని దొంగ ఓట్ల వల్ల లేదా ఓట్లు తీసేయడం వల్ల మనం ఎన్నికల్లో నష్టపోయే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. ఇన్‌ఛార్జ్‌లు పట్టించుకోకపోతే తానే సర్వే చేయించుకుంటానని ఆ తర్వాత ఆ నియోజకవర్గం బాధ్యతలు మీకు ఉండవంటూ చంద్రబాబు వారికి కరాఖండీగా చెప్పారు.

దొంగ ఓట్ల నివారణకు టీడీపీ కింది స్థాయిలో క్లస్టర్లు, యూనిట్ల వ్యవస్థను రూపొందించింది. వాటి ద్వారా బూత్‌ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎంపిక చేసి ఓటర్ల జాబితా తనిఖీల పని అప్పగిస్తోంది. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 20 వరకూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగనుంది. ప్రతి పోలింగ్‌ బూత్‌కు ప్రభుత్వపరంగా ఒక అధికారిని బూత్‌ లెవల్‌ అధికారిగా నియమిస్తున్నారు. ఈ అధికారి తనకు కేటాయించిన బూత్‌ పరిధిలో ఇంటింటికీ వెళ్లి అందరు ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయా లేదా ఎవరైనా అక్కడి నుంచి వెళ్లిపోయారా లేక చనిపోయారా కొత్తగా అర్హులైన వారు ఉన్నారా అన్నది నిర్ధారించుకోవాలి. బీఎల్‌వో వెంట అన్ని రాజకీయ పక్షాలకు చెందిన బూత్‌ స్థాయి ఏజెంట్లు కూడా ప్రతి ఇంటికీ వెళ్లవచ్చని కమిషన్‌ సూచించింది. జాబితాల్లో మార్పుచేర్పుల సమాచారాన్ని బీఎల్‌వో తన పరిధిలోని బూత్‌ ఏజెంట్లకు కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిని అవకాశంగా చేసుకుని పార్టీ నేతలు ఇంటింటి సర్వేలో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. సర్వేకు ముందే బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించాలని, ఎన్నికల సమయానికి అప్పుడున్న పరిస్థితిని బట్టి మార్పుచేర్పులు చేసుకోవచ్చని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story