TDP PROTEST: కొనసాగుతున్న దీక్షలు, ఆందోళనలు

TDP PROTEST: కొనసాగుతున్న దీక్షలు, ఆందోళనలు
X
చంద్రబాబుకు మద్దతుగా వెల్లువెత్తుతున్న ప్రజాభిమానం... అధినేత విడుదలయ్యే వరకు కొనసాగుతాయని స్పష్టీకరణ...

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతల రీలే దీక్షలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. బాబుతో మేము అంటూ ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకారులు నినదిస్తున్నారు. అనంతపురం, కళ్యాణదుర్గంలో టీడీపీ చేపట్టిన దీక్షలకు పెద్దసంఖ్యలో మహిళలు, యువకులు హాజరై మద్దతు తెలిపారు. కంబదూరు రహదారిపై తెలుగు యువత నేతలు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. సత్యసాయి జిల్లాలోని గొల్లపల్లి జలాశయంలో టీడీపీ శ్రేణులు జలదీక్ష నిర్వహించాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతపురంలో టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టాయి. గుమ్మడికాయలపై జగన్ వైరస్‌ అని రాసి వాటిని పగలగొట్టారు. YSR జిల్లా మైదుకూరులో బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు రిలే దీక్ష చేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ కర్నూలు జిల్లా గోనెగండ్లలోని చింతలముని నల్లారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదోనిలో కళ్లు గీత కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. కళ్ళు తీసే కుండలపై 'బాబు కోసం మేము సైతం' అని రాసి..సైకో పోవాలి..సైకిల్ రావాలంటూ గోవింద నామాలతో నినాదాలు చేశారు.


నెల్లూరులోని శ్రీ వెంగమాంబ ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన నారసింహ హోమం చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరులో తెదేపా మహిళా నాయకురాలు వేగుంట రాణి ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజు కొనసాగుతుంది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల నుంచి రాచపూడి వరకు అద్దంకి MLA గొట్టిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర చేశారు. విజయవాడలో TNSF నేతలు పొట్లూరి దర్షిత్, రేపాకుల శ్రీనివాస్ ఆమరణ నిరాహారదీక్ష మూడోరోజుకు చేరింది. NTR జిల్లా నందిగామలో టీడీపీ కార్యకర్తలు చేపట్టిన దీక్షలో మాజీమంత్రి దేవినేని ఉమా, మాజీ MLA తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.


చంద్రబాబు అరెస్టుతో జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని మాజీ MLA చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా పెదపాడులో రిలే దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో కూరగాయలు, పూతరేకులతో "ఐ యామ్‌ విత్‌ CBN” అని రైతులు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరంలో స్థానిక మహిళ ..భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు.


వైసీపీ నియంతృత్వ పాలనను ప్రశ్నించినందుకే చంద్రబాబుపై కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరహార దీక్షలు, కొవ్వొత్తులు, కాగడాల ర్యాలీలు కొనసాగించారు. అధినేత విడుదలయ్యేంత వరకు దీక్షలు కొనసాగుతాయని టీడీపీ కార్యకర్తలు స్పష్టం చేశారు.

Tags

Next Story