PROTESTS: ఊరూరా అలుపెరగని పోరు

PROTESTS: ఊరూరా అలుపెరగని పోరు
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసనలతో కదం తొక్కారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా నెల్లూరు జిల్లా చేజర్లలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ డిపోలో మహిళలు కరపత్రాలు పంపిణీ చేస్తూ బాబుకు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అమరావతి మహిళలు, రైతులు.. కొవ్వొత్తులు, కాగడాల ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు అరెస్టుకు ఖండిస్తూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. నిరసన తెలుపుతున్న కౌన్సిలర్లను పోలీసులు అరెస్టుచేశారు.


చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ కృష్ణా జిల్లా నిడుమోలులోని జాతీయ రహదారిపై... తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆందోళన చేశారు. తర్వాత విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. మోపిదేవి గ్రామంలో కొవొత్తుల ర్యాలీలో సైకో పోవాలి -సైకిల్ రావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పెనమలూరులో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బోడె ప్రసాద్ ఆధ్వర్యాన జరుగుతున్న దీక్షలో కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం పోతునూరులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.


చందబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు జలాశయంలో తెలుగు యువత ఆధ్వర్యాన జలదీక్ష చేపట్టారు. బాబుకు మద్దతుగా అనంతపురం కళ్యాణదుర్గం దీక్షా శిబిరం వద్ద తెలుగు యువత నాయకులు, జనసైనికులు సంతకాలు సేకరించారు. ఉరవకొండ మండలం లత్తవరం వద్ద ఉన్న హంద్రీనీవా కాలువలో జలదీక్ష చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని నంద్యాల దీక్షలో మాజీమంత్రి ఫరూక్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో తెలుగుదేశం నేత గాలి భానుప్రకాష్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలో బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అనకాపల్లి జిల్లా నామవరం గ్రామానికి చెందిన యువకుడు పాయకరావుపేట సమీపంలోని కొండపై ఉన్న యేసుప్రభు సిలువ వద్దకు మోకాళ్లపై నడిచారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని జీసెస్‌ను ప్రార్థించారు. నాతవరంలో ముస్లింల ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో TNSFఅధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story