AP: గేరు మార్చిన కూటమి అభ్యర్థులు

AP: గేరు మార్చిన కూటమి అభ్యర్థులు
మండుటెండలను లెక్క చేయకుండా విస్తృత ప్రచారం.... మరోసారి మోసపోవద్దంటూ ప్రజలకు సూచన

ఏపీలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ప్రచారంలో గేర్‌ మార్చారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా గ్రామాలు, పట్టణాల్లో ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కూటమి ప్రభుత్వం వస్తే అమలు చేయబోయే పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోసారి మోసపోవద్దంటూ ప్రజలకు సూచిస్తున్నారు. కూటమి అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మీ ఇంటి ఆడపడుచును... ఆదరించి గెలిపించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్‌కు మద్దతుగా... నగరంలోని పలు వార్డుల్లో ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించారు. గుంటూరు వికాస్‌నగర్‌లో అపార్ట్‌మెంట్‌ వాసులతో కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మాధవి సమావేశం నిర్వహించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని నేతలు ఆరోపించారు. బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి M.M కొండయ్యను గెలిపించాలని కోరుతూ పట్టణ తెలుగుదేశం నాయకుడు శ్రీనివాసరావు సైకిల్‌ ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని ఓటు అభ్యర్థించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ మండలంలోని కారెడ్డిపల్లి, మల్లయ్యగారిపల్లె గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వెంకటప్రసాద్ సతీమణి యశోదాదేవి సైదాపురం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలసి మైదుకూరు పురపాలక పరిధిలో ప్రచారం నిర్వహించారు. ప్రొద్దుటూరులో కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి.... కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. మన ఊరు - మన బీవీ పేరుతో మహిళలతో ముఖాముఖి నిర్వహించి... కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు కలిగే మేలును వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు కోడేరు మండలం కొండేపూడిలో కుటుంబ సమేతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి... ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆధ్వర్యంలో గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. G.V.M.C 7వ వార్డు పరిధిలో భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పర్యటించి కాలనీవాసులను ఓట్లు అభ్యర్థించారు.

Tags

Read MoreRead Less
Next Story