TDP: అంబరాన్నంటిన టీడీపీ సంబరాలు

TDP: అంబరాన్నంటిన టీడీపీ సంబరాలు
చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ రావడంపై హర్షాతిరేకాలు.... ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు జగన్‌కు చెంపపెట్టన్న నేతలు

చంద్రబాబు బెయిల్ ఉత్తర్వుల్లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు CID చీఫ్ సహా వైసీపీ పెద్దలకు చెంపపట్టని తెలుగుదేశం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి నైతికత ఉంటే ప్రాథమిక ఆధారాల్లేకుండా జైల్లో పెట్టినందుకు చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అటు చంద్రబాబుకు బెయిలు వచ్చినందుకు తెలుగు తమ్ముళ్లు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.


డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరంలో నారా చంద్రబాబునాయుడు కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పార్టీ కార్యాలయం వద్ద కేకు కట్ చేసి బాణాసంచా కాల్చిన తెలుగుదేశం నేతలు న్యాయం గెలిచిందంటూ నినాదాలు చేశారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఆలస్యంగానైనా సరే స్పష్టమైన తీర్పు వచ్చిందన్నారు. చంద్రబాబుకి బెయిల్ రావడంపై పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. నేతలు బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు.


విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఏపీ కార్యనిర్వహణ కార్యదర్శి చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు టపాసులు కాల్చారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని నేతలు ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ బూటక మాటలను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో హై కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సందర్భంగా విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అధ్వర్యంలో స్వీట్స్ పంచి, టపాసులు కాలుస్తూ తెలుగుదేశం నేతల సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోయినా సైకో ముఖ్యమంత్రి అన్యాయంగా జైల్లో పెట్టించారని ఆరోపించారు. తమ నాయకుడిపై ఏ ఆధారాలూ లేని కేసులు బనాయించి 50 రోజులు జైల్లో పెట్టించారని తెలిపారు. కాస్త ఆలస్యమైనా చివరికి సత్యమే గెలిచిందన్నారు. 22 నెలల్లో ఒక్క ఆధారమైనా చూపించలేదని.. ఇంకా ఎన్ని రోజులు అతను జైల్లో ఉంచాలని హైకోర్టు జగన్‌ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు.


చంద్రబాబు నాయుడు సింహంలా బయటకు వచ్చారని, ఆయన గర్జించబోతున్నారని, జగన్ మోహన్ రెడ్డి కాసుకోవాలని టీడీపీ నేతలు హెచ్చరించారు. చంద్రబాబుకు బెయిల్ రావడం పట్ల ఎంత సంతోషంగా ఉన్నామో, లోకేశ్ పాదయాత్రకు మరలా సిద్ధం కావడం మరింత ఆనందంగా ఉందని తెలిపారు. ఇద్దరి ప్రభంజనాన్ని జగన్ తట్టుకోలేరని.. ఆరు నెలల్లో ఆయన గద్దె దిగడం తధ్యమని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story