BABU HEALTH: చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన

BABU HEALTH: చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన
ప్రధానికి తెలుగుదేశం లేఖ...స్టెరాయిడ్లు ఇచ్చేందుకు యత్నిస్తున్నారన్న కుటుంబసభ్యులు

రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైoదని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. తన భర్త క్షేమంపై తాను చాలా ఆందోళన చెందుతున్నానని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారన్న ఆమె ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పినట్టు ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం చంద్రబాబు ఆరోగ్యంపై వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి ఏదైనా హాని జరిగితే అందుకు సీఎం జగన్ దే బాధ్యతని హెచ్చరించారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించటం హృదయ విదారకమని లోకేశ్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఇది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకి వైద్యం అందించేందుకు వ్యక్తిగత వైద్యలను అనుమతించాలని సినీనటుడు బాలకృష్ణ డిమాండ్ చేశారు.


జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రాణం ప్రమాదంలో పడిందని తెలుగుదేశం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా ముప్పు జరిగితే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని హెచ్చరించారు. చంద్రబాబుకు సరైన వైద్యం అందించాలంటూ రాజమహేంద్రవరంలోతెలుగుదేశం ఆధ్వర్యంలో చేపట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డగించగా వారు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు తాడేపల్లిలోని సీఎం నివాసం సమీపంలో బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావును పోలీసులు అడ్డుకున్నారు.


చంద్రబాబు ఆరోగ్యం క్షీణించినట్లు నివేదికలు వచ్చాయని తక్షణమే జోక్యం చేసుకుని అత్యుత్తమ వైద్య సహాయం అందేలా చూడాలని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ... ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. జగన్ ప్రభుత్వ ప్రతీకార చర్యలు, రిమాండ్ లో ఉన్న చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని లేఖలో వివరించారు. చంద్రబాబుకు అవాంఛనీయ స్టెరాయిడ్లు ఇచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు తక్షణమే వైద్య సహాయం అవసరమనివెంటనే జోక్యం చేసుకుని మెరుగైన చికిత్స అందేలా చూడాలని లేఖలో ప్రధాని మోదీని కనకమేడల కోరారు. ఇటు ఆంధ్రప్రదేశ్ జైళ్లశాఖ డీజీకి తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రాజమహేంద్రవరం జైళ్లో ఉన్న... చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తున్నందున చికిత్స చేసేందుకు వ్యక్తిగత వైద్యుల బృందాన్ని అనుమతించాలని కోరారు. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా లేఖను పంపారు.

Tags

Read MoreRead Less
Next Story