తిరుపతి ఉప పోరు ప్రచారంలో స్టైల్‌ను మార్చిన టీడీపీ..!

తిరుపతి ఉప పోరు ప్రచారంలో స్టైల్‌ను మార్చిన టీడీపీ..!
తిరుపతి ఉప పోరులో స్టైల్‌ పూర్తిగా మార్చుకుంది టీడీపీ. భారీ సభలు, హంగామా మీటింగ్‌లను పక్కన పెట్టింది. చాలా ఫోకస్డ్‌గా ప్రచారాన్ని చేపడుతోంది.

తిరుపతి ఉప పోరులో స్టైల్‌ పూర్తిగా మార్చుకుంది టీడీపీ. భారీ సభలు, హంగామా మీటింగ్‌లను పక్కన పెట్టింది. చాలా ఫోకస్డ్‌గా ప్రచారాన్ని చేపడుతోంది. నేతలంతా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. వారి నియోజకవర్గాలు కాకపోయినప్పటికీ.. నేతలు మాత్రం తిరుపతి ఓటర్లను తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు కష్టపడుతున్నారు. ప్రచారం చేస్తున్న ప్రతి నేత కదలికలపై చంద్రబాబు, లోకేశ్‌ ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటుండడంతో టీడీపీ లీడర్లు మరింత జాగ్రత్తగా ప్రచారం చేస్తున్నారు. పైగా మంగళగిరిలోని పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రతి వార్డు, డివిజన్‌ను మానిటర్ చేస్తోంది టీడీపీ. దీంతో మాజీ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి గడపకు వెళ్తున్నారు.

గతంలో చంద్రబాబు ప్రచారం అంటే సభలు, సమావేశాలే. ఇప్పుడు చంద్రబాబు కూడా స్వయంగా వీధుల్లో పాదయాత్ర చేస్తూ స్థానికులను పలుకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరహా ప్రచారానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుండడంతో.. ప్రతి రోజు రోడ్‌ షోల కంటే ముందు ఆయా కాలనీల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. ఆ తరువాతే రోడ్ షోలు చేస్తున్నారు. మరోవైపు లోకేశ్ కూడా రోడ్‌ షోలు చేస్తూనే కొన్ని ప్రాంతాల్లో కాలినడకన ప్రచారం చేస్తున్నారు. లోకేశ్‌ ఇప్పటి వరకు పర్యటన చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ గల్లీల్లో తిరిగారు, దుకాణాల్లోకి వెళ్లారు, వైసీపీ వ్యక్తులు ఉన్న చోట కూడా వెళ్లి ఓట్లు అడిగారు. వాళ్లు వీళ్లు అని చూడకుండా గడప గడపకు నేతలు వరస కట్టారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని రెండు మూడు సార్లు చుట్టేలా ప్లాన్ చేశారు. మొత్తానికి గతానికి భిన్నంగా ఈసారి ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు.

గెలుపు ఓటములు ఎలా ఉండబోతున్నా.. టీడీపీ మాత్రం తన పంథా మార్చుకుంది. 2019 ఓటమి తరువాత పార్టీలో వచ్చిన అతి పెద్ద మార్పుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ ఇంటింటి ప్రచారం ఎంత మేలు చేస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story