CBN: ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తాం

CBN: ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తాం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా... పొత్తు ప్రకటనతోనే వైసీపీ ఓటమి ఖాయం

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కట్టిన వేళ...ఏపీలో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతున్నాయని, తాము స్వీప్‌ చేయడం ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయేలో చేరికపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన హస్తినలోని గల్లా జయదేవ్‌ నివాసంలో విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము తిరిగి ఎన్డీయేలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుత జగన్‌ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించాలంటే కేంద్రప్రభుత్వ సహకారం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి పనిచేయడం ముఖ్యమని అభిప్రాయపడిన చంద్రబాబు ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అది రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు.


గత అయిదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందన్న చంద్రబాబు..... రాష్ట్ర పరువు ప్రతిష్ఠలు మసకబారాయన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ సంపద సృష్టికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటే ...ఏపీ సీఎం మాత్రం ధ్వంసం చేయాలనే చూస్తున్నారన్నారు. గతంలో తాను పునాదులు వేసిన హైటెక్‌సిటీ, ఔటర్‌రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టును తర్వాత వచ్చిన రాజశేఖరరెడ్డి ధ్వంసం చేసి ఉంటే హైదరాబాద్‌ ఇంత అభివృద్ధి చెందేది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దానికి పూర్తి వ్యతిరేకమైన పాలన సాగుతోందన్నారు. గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ పురోగతి, అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్న చంద్రబాబు..... ప్రస్తుతం భారతదేశం ప్రపంచ గమ్యస్థానంగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. మోదీ హయాంలో భారత్‌ వృద్ధిరేటు పరంగా ప్రపంచంలోనే అగ్రభాగాన నిలుస్తోందన్న ఆయన....... దేశంలోని మిగతా రాష్ట్రాలు ముందుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే వెనక్కి వెళ్లడం దేశానికి మంచిది కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్లా కూటమి ప్రభుత్వాలు ఉంటే రాష్ట్రానికి గొప్ప అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా నాయకత్వంతో ఎప్పుడూ వ్యక్తిగత విభేదాల్లేవన్నచంద్రబాబు... గతంలో ప్రత్యేకహోదా డిమాండ్‌తో ఎన్డీయే నుంచి బయటికొచ్చాం తప్ప మరే కారణం లేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర సంపూర్ణ ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో ఫార్ములాలు పనిచేయవన్న బాబు పరస్పరం అర్థం చేసుకోవడమే ముఖ్యమన్నారు.


వైసీపీతో బీజేపీ నాయకత్వానికి ఎలాంటి అధికారిక అవగాహన, ఒప్పందం లేవన్న చంద్రబాబు.... వ్యక్తిగత అవసరాల రీత్యా మద్దతిస్తూ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా, క్రియాశీలకంగా పనిచేసినప్పుడు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకోవడానికి వీలుంటుందన్నారు. ప్రజలు మద్దతు పలికి అధికారం కట్టబెట్టినా జగన్‌ ఏనాడూ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. తాము ఎన్డీయేలో చేరిన విషయాన్ని మైనారిటీలు అర్థం చేసుకుంటారన్న బాబు...తమకే ఓటేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం సీట్లు గెలవడమే కూటమి లక్ష్యమన్న బాబు... ఇప్పుడు తాము పార్టీలను వేర్వేరుగా చూడటం లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story