PAWAN: మళ్లీ జగన్‌ను నమ్మితే ప్రతి ఇంటికి గొడ్డలి గిఫ్ట్‌

PAWAN: మళ్లీ జగన్‌ను నమ్మితే ప్రతి ఇంటికి గొడ్డలి గిఫ్ట్‌
కడపలో చంద్రబాబు రోడ్‌షోకు భారీగా తరలివచ్చిన ప్రజలు... కడపలో మళ్లీ హత్యా రాజకీయాలు తెచ్చారన్న టీడీపీ అధినేత

హత్యా రాజకీయాలు చేసే జగన్‌ను మరోసారి నమ్మితే ప్రతి ఇంటికి గొడ్డలి గిప్ట్‌గా వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. నవరత్నాలు పేరిట మరోసారి నవమోసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గత మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ అమలు చేయని జగన్....ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని చంద్రబాబు నిలదీశారు. వైఎస్‌ఆర్ జిల్లా కడపలో పర్యటించిన చంద్రబాబు....ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కడప ఎవరి జాగీరు కాదని...ప్రజలు తలచుకుంటే ఎంతటివారైనా నేలకు దిగాల్సిందేనని చంద్రబాబు అన్నారు. కడపలో ఆయన భారీ రోడ్‌షో నిర్వహించారు. నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయన్నారు. గత ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి వరాలు ఇచ్చిన జగన్...ఏ ఒక్క హామీ అమలు చేయలేదని చంద్రబాబు నిలదీశారు. ఐదేళ్లు ముఖ్యమంత్రి ఉండి సీఎం జగన్ సొంతజిల్లాలో కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.


కడప స్టీల్‌ప్లాంట్‌ను అటకెక్కించారని...కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. రాయలసీమలో మళ్లీ హత్యా రాజకీయాలకు తెరలేపారని చంద్రబాబు విమర్శించారు. హత్య కేసు నిందితులను పక్కనపెట్టుకుని జగన్‌ ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నవరత్నాల స్థానంలో నవమోసాలకు పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని చంద్రబాబు గుర్తుచేశారు. అధికారంలోకి వస్తే తిరిగి అన్ని పథకాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ తెలుగుదేశాన్ని ఆదరిస్తేనే కడప అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ అభ్యర్థి మాధవీరెడ్డి అన్నారు.


మరింత నష్టం: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ను అంధకారంలోకి నెట్టేసిన వైసీపీని అధఃపాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. లేకుంటే మన భవితకు మరింత నష్టం కలుగుతుందని ప్రజలను హెచ్చరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విడుదల చేసిన మ్యానిఫెస్టోతో అందరికీ మేలు జరుగుతుందన్న పవన్‌... అమలు బాధ్యతను తాను తీసుకుంటానని విశాఖలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో హామీ ఇచ్చారు. జగన్‌కు భూమిని తొలిచి డబ్బు తీయడమే తెలుసని.....భూమిలో విత్తనం నాటి పంట పండించి ప్రజల ఆకలి తీర్చడం తెలియదని పవన్‌ విమర్శించారు. కనీసం నీడనిచ్చే వేప చెట్టునైనా పెంచే మానసిక స్థితి జగన్‌కు లేదని విశాఖలో నిర్వహించిన ఎన్నికల సభలో దుయ్యబట్టారు. నమ్మి అందలమెక్కిస్తే నిలువునా ముంచేశారని విమర్శించారు. ఇప్పుడు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని పవన్‌ హెచ్చరించారు.

ఓట్ల బలంతో జగన్‌ను తుంగలో తొక్కేయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారన్న పవన్ …..ఓ పాట రూపంలో వైసీపీ పాలనను ఎద్దేవా చేశారు. ఆర్థిక రాజధానితో పాటు విశాఖను స్పోర్ట్‌ క్యాపిటల్‌గా మారుస్తామని పవన్‌ హామీ ఇచ్చారు.ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్‌కు ఆయన అభిమానులు చేపలు అందించారు.

Tags

Read MoreRead Less
Next Story