CBN: బటన్‌ నొక్కుడు పేరుతో ప్రజా ధనం బొక్కారు

CBN: బటన్‌ నొక్కుడు పేరుతో ప్రజా ధనం బొక్కారు
సీఎం జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం... అధికారంలోకి వచ్చాక అక్రమ సంపాదన కక్కిస్తామని హెచ్చరిక

సీఎం జగన్ బటన్‍ నొక్కుడు పేరుతో ప్రజా ధనాన్ని బొక్కారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక దోపిడీ సొమ్ము కక్కిస్తామని హెచ్చరించారు. కుప్పంలో రెండో రోజూ పర్యటించిన ఆయన గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే తన లక్ష్యమన్నారు. యువత వారి భవిష్యత్‌ కోసం సైకిలెక్కాలని పిలుపునిచ్చారు కుప్పంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండవ రోజు పర్యటన కోలాహలం మధ్య సాగింది. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించిన చంద్రబాబు...మార్గమధ్యలో నిరసనలు చేస్తున్న అంగన్‍ వాడీ, ఆశా వర్కర్ల శిబిరాలకు వెళ్లి మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దారిపొడవునా నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించిన చంద్రబాబు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.


శాంతిపురంలోని ఎన్టీఆర్‍ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసేందుకు జగన్ అధికారాన్ని వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. భూములు దోచుకునేందుకే ల్యాండ్‍ టైటిల్‍ చట్టం తెచ్చారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పం ప్రజలపై ప్రేమ లేదన్న చంద్రబాబు స్థానిక గ్రానైట్‌ను దోచుకునేందుకే వస్తున్నారని ధ్వజమెత్తారు. హంద్రీనీవా నీటిని కుప్పానికి తేవడంపైనా వైకాపాకు చిత్తశుద్ధి లేదని చంద్రబాబు విమర్శించారు. కాల్వల తవ్వకాల పనుల్లోనూ పెద్దిరెడ్డి అవినీతి వరద పారిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక దోపిడీ సొమ్ము కక్కిస్తామని హెచ్చరించారు. సామాజిక న్యాయం పేరుతో ప్రజలను వంచించిన జగన్‌కు ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు విమర్శించారు. ఎంత మంది ఎమ్మెల్యేలను మార్చినా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

రాజుపేట కూడలిలో తెలుగుదేశం జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు. రామకుప్పంలో 32 రకాల కూరగాయలతో గజమాలతో సత్కరించి కార్యకర్తలు అభిమానాన్ని చాటుకున్నారు. తర్వాత కుప్పం చెరుకున్న చంద్రబాబు బీసీఎన్‍, ఎమ్‍ఎమ్‍ కళ్యాణ మండపాల్లో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలతో విడివిడిగా సమావేశం నిర్వహించారు.. వైసీపీ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గంపై శీతకన్ను వేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో హంద్రీనీవా పనులను 87 శాతం పూర్తి చేస్తే... మిగిలిన పనులను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించిందని దుయ్యబట్టారు. కుప్పంలో అపారమైన గ్రానైట్‌ నిల్వలు ఉన్నందునే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంపై పడ్డారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక అవినీతి సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు. రాజుపేట రోడ్డు దగ్గర హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కుప్పం అభివృద్ధి జరిగిందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story