TDP: కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం

TDP: కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం
X
జగన్‌ ఇప్పటికే ఓటమిని అంగీకరించారన్న చంద్రబాబు.... ఇక దిగిపోవడమే మిగిలిందని ధీమా

ఆంధ్రప్రదేశ్‌లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో రా.. కదలిరా బహిరంగసభలో మాట్లాడిన తెలుగుదేశం అధినేత సీఎం జగన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. మద్యపాన నిషేధమని చెప్పి జగన్ మాట తప్పారని,మాట తప్పిన వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. సీఎం జగన్... రాజకీయ వ్యాపారి అని., మద్యంపై ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్‌లో లెక్కేసుకోవడమే జగన్ పని విమర్శించారు. మద్యం విక్రయాలపై డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవని ప్రశ్నించిన చంద్రబాబు నాణ్యత లేని మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని మండిపడ్డారు. నాణ్యత లేని మద్యం వల్ల 30 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారనిచంద్రబాబు ధ్వజమెత్తారు. అలాంటి జగన్‌కు ప్రజాకోర్టులో శిక్షించే సమయం.. దగ్గర పడిందన్నారు.


అనంతరం ఉరవకొండ బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లను క్లీన్‌స్వీప్‌ చేస్తామన్నారు. ఓటమి ఖాయమని తెలిసే, హ్యాపీగా దిగిపోతా అని జగన్‌ అంటున్నారని చెప్పారు. ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో నష్టపోని వ్యవస్థ లేదన్నారు. తెలుగుదేశం జనసేన కలిసినప్పుడే వైసీపీ ఓటమి ఖాయమైందన్న చంద్రబాబు.. జగన్‌ను భరించలేక వైసీపీ నేతలే పారిపోతున్నారని స్పష్టం చేశారు. మొన్న ఉరవకొండలోనే సీఎం సభ పెట్టారని... ఆ సభకు, టీడీపీ సభకు పోలికే లేదని చంద్రబాబు అన్నారు. అది జనాన్ని తరలించిన సభ అని... ఇది జనసంద్రమైన సభ అని... దీనికి పోలీసులే సాక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఆయన్ని విమర్శించిన ప్రతి ఒక్కరినీ టీడీపీ స్టార్‌ క్యాంపెయినర్లుగా జగన్‌ అభివర్ణిస్తున్నారని... నిజమే.. ఐదేళ్ల పాలనలో జగన్‌ చేతిలో మోసపోయిన ప్రతి బాధితుడు స్టార్‌ క్యాంపెయినరే నని చంద్రబాబు అన్నారు.


"జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తారని నమ్మి మోసపోయిన యువత, నష్టపోయిన రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు అందరూ నాకు స్టార్‌ క్యాంపెయినర్లే. ప్రతి ఆడబిడ్డ తెదేపా-జనసేనకు స్టార్‌ క్యాంపెయినర్‌ కావాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. కురుక్షేత్ర యుద్ధానికి తామూ సిద్ధమని టీడీపీ అధినేత పేర్కొన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే జగన్‌ ఓటమిని ఆమోదించారని... 2021లో నా వెంట్రుక కూడా పీకలేరన్నారని.... 2022లో దయచేసి నన్నే నమ్మండి అన్నారని... 2023లో నాకు ఎవరూ లేరని అన్నారని... మిమ్మల్నే నమ్ముకున్నానని అన్నారు. 2024కు వచ్చేసరికి ఆనందంగా దిగిపోతానని అంటున్నారు.. ఆయన దిగిపోవడం కాదు.. ప్రజలే ఆయన్ను దించేస్తారు. 70 రోజుల్లోనే రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది. టీడీపీ, జనసేన కార్యకర్తలు పదడుగులు ముందుకేస్తే నేను వంద అడుగులు వేస్తా. ‘సిద్ధం’ అంటూ భారీ హోర్డింగులు పెట్టిన అధికార వైసీపీకు సరేనంటూ మేమూ సవాలు విసురుతున్నాం’ అని శ్రేణులకు ధైర్యం చెప్పారు.

Tags

Next Story