CBN: జగన్‌.. బ్రిటీష్ వాళ్లను మించిపోయాడు

CBN: జగన్‌.. బ్రిటీష్ వాళ్లను మించిపోయాడు
తీవ్ర విమర్శలు గుప్పించిన చంద్రబాబు... ధరల పెరుగుదలకే జగనే కారణమన్న టీడీపీ అధినేత

సీఎం జగన్ పరిపాలనలో బ్రిటీష్ వాళ్లను మించిపోయారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. బాపట్ల జిల్లా చీరాలలో ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన, ఏపీలో నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగేందుకు జగన్ కారణమయ్యారని ఆరోపించారు. ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని ధ్వజమెత్తారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని ఏపీని మాఫియాల రాజ్యంగా తయారు చేశారని మండిపడ్డారు. దుర్మార్గ పాలన తుదముట్టించిప్రజాస్వామ్యం కాపాడుతామని చంద్రబాబు వివరించారు. కూటమి ప్రభుత్వం రాగానే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు దస్త్రంపై రెండో సంతకం పెడతానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటన్న ఆయన ఏపీలో ప్రజల ఆస్తులు, భూములకు రక్షణ లేదని ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్ ను వంద రోజుల్లో ఉక్కుపాదంతో అణచివేస్తామని తెలిపారు. వైకాపా నేతలు రౌడీయిజం ద్వారా రాజకీయాలు చేయాలని భావిస్తున్నారని, ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌ను జగన్‌ నియంతలా పాలించాలనుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విధ్వంసం చేయడమే ఆయన స్వభావమన్నారు. అప్పులు వచ్చే పరిస్థితి లేదు.. ఆదాయం తగ్గింది. జీతాలు ఇవ్వలేరు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్నారు. టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారు. స్కూళ్లకు రంగులు వేస్తే.. పిల్లలకు చదువు వస్తుందా? రూ.పది ఇచ్చి రూ.వంద దోచేస్తుంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా? ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చి.. ఆస్తులను బలవంతంగా రాసుకున్నారు. ప్రజల భూములపై జగన్‌ పెత్తనం ఏంటి? ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు దస్త్రంపైనే రెండో సంతకం చేస్తానని చంద్రబాబు తెలిపారు.

మళ్లీ చంద్రన్న బీమా అమలుచేస్తామన్నారు. సహజంగా మారణిస్తే రూ.5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షల బీమా కుటుంబానికి అందజేస్తాం. ప్రతీ కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పిస్తాం. అందరికీ డిజిటల్‌ హెల్త్‌కార్డులు జారీ చేస్తాం. మండల కేంద్రాల్లో జనరిక్‌ మెడికల్‌ షాపులు ఏర్పాటుచేసి బీపీ, షుగర్‌ ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

తమ కష్టంతో సమాజ నిర్మాణానికి చేయూతనిచ్చే శ్రామికుల హక్కులను కాపాడటంలో టీడీపీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తుచేశారు. రవాణా రంగ కార్మికుల కోసం డ్రైవర్‌ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. బ్యాడ్జ్‌ కలిగిన ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్‌కు, హెవీ లైసెన్స్‌ కలిగిన ప్రతి లారీ, టిప్పర్‌ డ్రైవర్‌కు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందజేస్తామని చంద్రబాబు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story