CBN: ఓట్ల అక్రమాలపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

CBN: ఓట్ల అక్రమాలపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
జగన్‌ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ టీడీపీ అధినేత.... 10వ తేదీ నుంచి జిల్లా పర్యటనలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. డిసెంబర్ 6 నుంచి 8 లోగా తాను కలిసేందుకు సమయం కేటాయించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించిన చంద్రబాబు స్వార్ధ ప్రయోజనాలు తప్ప ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను ఏనాడూ జగన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. కృష్ణా నదీ జలాల పునః సమీక్ష నిర్ణయంపై నోరు తెరవని జగన్ తెలంగాణ ఎన్నికల రోజు పోలీసులతో సాగర్ డ్యాంపై హడావుడి చేయడం సైకో చర్యని ధ్వజమెత్తారు. ఈనెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై తన నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను జగన్‌ నిర్వీర్యం చేయడంపై..ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్, ఏపీ సర్పంచ్‌ల సంఘం నిర్వహించే సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయించారు. ఈనెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపలో నిర్వహించే సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. వైసీపీ నాయకులు ఓటమి భయంతో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తీసేయించారని ఆయన ఫిర్యాదు చేయనున్నారు. డిసెంబరు 6 నుంచి ఎనిమిదో తేదీలోగా సమయం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాయనున్నారు.

కృష్ణా నదీ జలాలపై కేంద్రం పునఃసమీక్ష సందర్భంగా నోరు తెరవని జగన్‌... తెలంగాణలో పోలింగ్‌ రోజున నాగార్జున సాగర్‌ వద్ద పోలీసులతో హడావుడి చేయడం సైకో చర్యని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నాలుగున్నరేళ్లలో జగన్‌ తన స్వార్థ, వ్యాపార ప్రయోజనాల కోసం పాకులాడారే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. సాగర్‌ డ్యాం వద్ద హడావుడి చేసి విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. నీటి వినియోగంపై అవగాహనలేని వాళ్లు ..పాలకులు కావడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయన్నారు. కుటిల రాజకీయాలతో జగన్ రాష్ట్రం పరువు తీస్తున్నారని సమావేశంలో మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఐపీఎస్ వ్యవస్థ చట్టాలను కాపాడుతుంటే.. అందుకు విరుద్ధంగా జగన్ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ అభిప్రాయపడింది. సంక్షేమ పథకాలకు కేంద్రం డబ్బులు ఇస్తున్నా రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడం వల్లే చాలా పథకాలు నిలిచిపోయాయని నేతలు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story