TDP: ఊరూరా జగన్‌ గూండాల రాజ్యమే

TDP: ఊరూరా జగన్‌ గూండాల రాజ్యమే
ఏపీ డీజీపీ వీఆర్‌ఎస్‌ తీసుకోవాలి... చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, ఊరూరా జగన్ గూండాలు రాజ్యమేలుతున్నారని. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల సహకారంతో మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు, క్రోసూరులో రౌడీమూకల విధ్వంసం సృష్టించారని మండిప్డడారు. అరాచకాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. క్రోసూరులో ఎమ్మెల్యే కుమారుడు వందల మందితో వచ్చి ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకుండా వారికే పోలీసులు కొమ్ముకాయడమేంటని నిలదీశారు. పోలీసు శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఇలాంటి ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్నించారు. పోలీసు శాఖ కళ్ల ముందు పతనమవుతుంటే కట్టడి చేయలేని డీజీపీ... తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు... చట్టానికి కట్టుబడి పనిచేయాలని హితవు పలికారు. మరో 2 నెలల్లో ఈ రౌడీమూకలను ప్రజాకోర్టు శిక్షిస్తుందని, తప్పు చేసిన అధికారులను న్యాయస్థానాలు తప్పక శిక్షిస్తాయని చంద్రబాబు అన్నారు.


మరోవైపు ఎన్నికలకు 2 నెలల ముందే వైసీపీ చేతులెత్తేసిందని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు తెలుగుదేశం నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రోసూరు, మార్టూరు ఘటనలు అధికార పార్టీ అరాచకాలకు పరాకాష్టన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు సంయమనం పాటించి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. దొంగ ఓట్లు అవినీతి సొమ్ముతో.. మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పచ్చి అబద్ధాల కోరని విమర్శించారు. రాజమహేంద్రవరం రూపులేఖలు మార్చామని ఎంపీ మార్గాని భరత్ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరం అభివృద్ధికి వైసీపీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.


వైసీపీ MLAల అవినీతి, అక్రమాలపై... ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుప్రశ్నించారు. కంచేటి సాయిని వేధించడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఆయన వైసీపీ నేతలుబహిరంగంగా మారణాయుధాలతో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

మరోవైపు అధికారం చివరిదశలో DSC నోటిఫికేషన్ పేరిట ముఖ్యమంత్రి హడావుడి చేస్తున్నారని... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. చివరి దశలో నోటిఫికేషన్ ఇచ్చినా యువత నమ్మబోరని అన్నారు. నాటకాల వైసీపీ ప్రభుత్వం త్వరలోనే పోతుందన్న లోకేష్... యువతకు ఉద్యోగాలు కల్పించే తెలుగుదేశం - జనసేన ప్రభుత్వం వస్తుందని ఎక్స్ లో ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story