AP: బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు

AP: బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
X
అమరావతి రైతుల బ్రహ్మరథం... ఐదు దస్త్రాలపై సంతకాలు చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ...ఐదు కీలక ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. 16 వేల 347 పోస్టులతో మెగా DSC ఫైల్‌పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు, పింఛన్లు 4 వేలకు పెంపు, నైపుణ్య గణన, అన్న క్యాంటీన్‌ల పునరుద్ధరణ దస్త్రాలపై సంతకాలు పెట్టారు. అంతకుముందు సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు రాజధాని రైతులు అఖండ స్వాగతం పలికారు.


ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కుటుంబసమేతంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కూడా దర్శించుకున్నారు. తర్వాత ఉండవల్లిలోని నివాసం వెళ్లిన ఆయన....సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు వెలగపూడిలోని సచివాలయనికి బయల్దేరగా అడుగడుగునా అమరావతి రైతులు అపూర్వ స్వాగతం పలికారు. కరకట్టతో పాటు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపైకి భారీగా చేరుకున్న రైతులు దారిపొడవునా నిల్చుని సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. సచివాలాయనికి వెళ్లే దారిపొడవునా పూలు పరిచి. బ్రహ్మరథం పట్టారు. గజమాలలతో అభిమానాన్ని చాటారు. చంద్రబాబు సైతంప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.


రాజధాని రైతులు, ప్రజల అఖండ స్వాగతం మధ్య సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రివర్గ సహచరుల సమక్షంలో సాయంత్రం 4గంటల 41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వెంటనే ఎన్నికల హామీల అమలు దిశగా 5 కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. 16వేల 347 పోస్టులతో కూడిన మెగా DSC దస్త్రంపై మొదటి సంతకం చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దుచేస్తూ రెండోసంతకం చేశారు. సామాజిక పింఛన్లను ఒకేసారి నాలుగు వేల రూపాయలకు పెంచుతూ మూడో సంతకం పెట్టారు. పేదలకు 5రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను జగన్‌ రద్దు చేయగా...... వాటిని పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించేందుకు వీలుగా.. నైపుణ‌్యగణన దస్త్రంపై చంద్రబాబు ఐదో సంతకం చేశారు.

ఐదు దస్త్రాలపై సంతకాలు చేసిన చంద్రబాబుకు సామాన్య ప్రజలు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతల స్వీకారం సందర్భంగా సీఎం ఛాంబర్‌ కిటకిటలాడింది. చంద్రబాబుకు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చంద్రబాబును కలిసేందుకు యత్నించగా వారికి అనుమతి నిరాకరించారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ, IPS అధికారులు PSR ఆంజనేయులు, PV సునీల్ కుమార్.. ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన కార్యాలయ సిబ్బంది అంగీకరించలేదు.

Tags

Next Story