CBN: క్విట్ జగన్... సేవ్ రాయలసీమ

హత్యా రాజకీయాలు చేస్తున్న జగన్‌కి మద్దతిస్తారా..? లేక అభివృద్ధి వైపు నిలిచిన తమకి అండగా ఉంటారో ప్రజలే నిర్ణయించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏకపక్షంగా మద్దతిచ్చిన సీమకి ఐదేళ్లలో జగన్ చేసింది శూన్యమన్న ఆయన ప్రజల తీర్పును అవినాష్‌రెడ్డిపై కేసులు రాకుండా చూసుకునేందుకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. క్విట్ జగన్ సేవ్ రాయలసీమ అని నినదించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి అమ్మేవాడిని భూమిపై లేకుండా చేస్తానని తేల్చిచెప్పారు. ప్రజాగళం ప్రచార సభల్లో భాగంగా రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. YSR జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత ప్రొద్దుటూరు సభలో పాల్గొన్న ఆయన గత ఎన్నికల్లో ఏకపక్షంగా జగన్‌కు మద్దతు తెలిపిన రాయలసీమ ప్రాంత వాసులకు ఐదేళ్లలో జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. సొంత జిల్లానీ అభివృద్ధి చేయలేదన్నారు. కేవలం సీట్ల కోసమే సీమ ప్రజలను జగన్ వాడుకుంటున్నాడన్న చంద్రబాబు వాస్తవాన్ని గ్రహించి తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో అండగా నిలబడాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్, గంజాయి విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 100 రోజుల్లో వాటిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. సొంత బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని జగన్ కడప ఎంపీ బరిలోకి దింపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఎంపీగా కావాలో లేక... ప్రజలకు సేవచేసే వ్యక్తి ఎంపీగా ఉండాలో కడప ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సూచించారు. తర్వాత నాయుడుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు... తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గా చేసి.. సీమతో పాటు నెల్లూరు జిల్లా యువతకి ఉపాధి కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. జగన్ అధికారంలోకి రాగానే పరిశ్రమలను వెళ్లగొట్టి ఉపాధి అవకాశాల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జరిగిన అనర్థాలను సరిదిద్దేందుకు ప్రజలందరూ NDA కూటమిని గెలిపించాలని చంద్రబాబు అభ్యర్ధించారు.
‘జగన్‌కు నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలుసా..? రాయలసీమకు నీళ్లిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది. కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా కల. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి. ఆ సంకల్పంతోనే 72 శాతం పనులు పూర్తి చేశాం. ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా..? రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ నినాదం కావాలి. ఈ అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com