CBN: ఎందుకీ గులకరాయి డ్రామాలు

గులకరాయి డ్రామా పేరుతో మరోసారి తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ నష్టపోకూడదనే తాను పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. జీడి పరిశ్రమకు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరి నీళ్లువంశధారకు తెస్తామన్నారు. నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు సహా ఉద్యోగులు గౌరవంగా పనిచేసుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్రజాగళం పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రలోని రాజాం, పలాస సభల్లో పాల్గొన్నారు.
తొలుత రాజాంలో పర్యటించిన ఆయన సీఎం విశాఖ ప్రేమలేదని, అక్కడి ఆస్తులపైనే ప్రేమ ఉందని ఆరోపించారు. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి, డ్రగ్స్ రాజధాని చేసిందని దుయ్యబట్టారు. గులకరాయి పేరుతో డ్రామా ఆడుతున్నారన్న చంద్రబాబు తప్పును ఎదుటవారిపై నెట్టేయడంలో జగన్ దిట్టని విమర్శించారు. అనంతరం పలాస ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. తనకు పదవి అనేది బాధ్యత అయితే... జగన్‌కు వ్యాపారమని ధ్వజమెత్తారు. విశాఖ నుంచి భావనపాడు వరకు పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పునరుద్ఘాటించారు. ఉద్యోగులకు డీఏ సహా గౌరవప్రదంగా పని చేసుకునే వాతావరణం కల్పిస్తామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా సాధించేది ఉత్తరాంధ్ర యువతేనన్న చంద్రబాబు... అందులో శ్రీకాకుళం యువత చాలామంది ఆర్మీలో ఉద్యోగాలు సాధిస్తున్నారన్నారు. కాస్త అండగా నిలిస్తే మన యువత అద్భుతాలు చేస్తారన్నారు. ‘‘ విశాఖ నుంచి భావనపాడు వరకు పరిశ్రమలు తీసుకొస్తాం. పరిశ్రమలు వస్తే యువత బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వంశధార నీటిని బారువా వరకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తా. రూ.4 వేల పింఛన్‌ను ఇంటికే తీసుకొచ్చి ఇస్తాం. యువతకు ఉద్యోగాలు రావాలంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి’’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని, అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐదేళ్లపాటు ప్రజలు అనేక బాధలు పడ్డారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మద్యం, కరెంటు బిల్లు, ఇసుక, సిమెంట్, ఇనుము, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి.. ప్రజల రక్తాన్ని జగన్ జలగలా పీల్చేశారని విమర్శించారు. చెత్తపన్ను, వృత్తిపన్ను పేరుతో ప్రజల్ని నిలువునా ముంచేశారని మండిపడ్డారు .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com