PROTEST: కొనసాగుతున్న ఆందోళనలు

PROTEST: కొనసాగుతున్న ఆందోళనలు
X
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నిరసనలు... జగన్‌ ప్రభుత్వ విధానాలపై మండిపాటు...

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుపై ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం శ్రేణులు రోడ్డెక్కారు. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో నందమూరి బాలకృష్ణ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ ప్రతిపక్ష నేతలను కూడా అక్రమ కేసుల్లో ఇరింకించాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబుకు మంచి జరగాలని కోరుకుంటూ రిషికేష్‌లో విజయవాడ MP కేశినేని నాని దంపతులు పూజలు నిర్వహించారు.


పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో బోస్‌ బొమ్మ కూడలి వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం ముందు ఓ కార్యకర్త గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. పార్వతీపురం RTC కాంప్లెక్స్ వద్ద తెదేపా నేతలు చేపట్టిన దీక్షను... పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో పాల్గొన్న శ్రేణులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించడంతో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మార్కెట్‌ కమిటీ వద్ద శ్రేణులు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత దీక్ష చేపట్టారు. విశాఖ GVMC గాంధీ బొమ్మ వద్ద తెదేపా చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శ్రేణులందరినీ బలవంతగా వాహనాల్లోకి ఎక్కించారు. ఒక మహిళను చుట్టుముట్టిన పోలీసులు.... బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. కనీసం తన వయస్సు కూడా గౌరవించకుండా.... ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.


విజయనగరం బస్టాండ్‌ వద్ద దీక్షను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. శిబిరం నుంచి కదిలేది లేదంటూ... నేతలు పడుకుని నిరసన తెలిపారు. పోలీసులు, శ్రేణుల మధ్య వాగ్వాదాలతో ఉద్రిక్తత తలెత్తింది. చివరికి శిబిరాన్ని ఖాళీ చేయించిన పోలీసులు... కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయంలో తెదేపా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు త్వరగా విడుదలవ్వాలని కోరుకుంటూ... 101 టెంకాయలు కొట్టారు. సీతానగరం మండలం జోగంపేటకు చెందిన మంగి సుబ్బమ్మ అనే వృద్ధురాలు... చంద్రబాబు అరెస్టుపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సుపరిపాలన అందించిన మహనీయుడిని అరెస్టు చేయడం న్యాయమేనా అంటూ విలపించారు.

Tags

Next Story