PROTESTS: అరగుండుతో నిరసనలు.. అర్ధనగ్న ప్రదర్శనలు

PROTESTS: అరగుండుతో నిరసనలు.. అర్ధనగ్న ప్రదర్శనలు
చంద్రబాబు అరెస్ట్‌ అయినప్పటి నుంచి ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టయిన నాటి నుంచి మొదలైన నిరసన జ్వాలలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరుపై మండిపడుతూ కొందరు అరగుండుతో నిరసన తెలుపగా మరికొందరు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు వెంటనే విడుదల కావాలని కోరుకుంటూ మరికొందరు ఆలయాల్లో పూజలు చేశారు.


బాబు కోసం మేముసైతం అంటూ రిలే నిరాహార దీక్షలు, కాడగాల ర్యాలీలు, జలదీక్షలు చేపట్టారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించిన చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులు ఆపాలంటూ కోనసీమ జిల్లా రావులపాలెంలో బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కరపత్రాలు పంచారు. చంద్రబాబు అరెస్టుపై ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో నల్లబెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు.


తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలో కాగడాల ర్యాలీ చేశారు. K.S.జవహార్ ఆధ్వర్యంలో కొవ్వూరు మండలం దారవరం నుంచి నిడదవోలు కోటసత్తమ్మ ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ అమ్మవారికి పూజలు చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో తెలుగుదేశం శ్రేణులు చేపట్టిన పాదయాత్రకు జనసైనికులు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు క్షేమం కోసం యర్రవరం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆర్టీసీ బస్సులను శుభ్రం చేస్తూ తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు.


చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ NTR జిల్లా జగ్గయ్యపేటలో తెలుగుదేశం నాయకులు దీక్ష చేశారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా చందర్లపాడులో నిర్వహించిన కాగడాల ర్యాలీలో "బాబు కోసం మేము సైతం" అంటూ నినదించారు. ర్యాలీ తర్వాత అలివేలమ్మ ఆలయంలో టెంకాయలు కొట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో తెలుగుమహిళలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ నేత కొండయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.


అద్దంకి తెలుగుమహిళా విభాగం ఆధ్వర్యంలో "చంద్రన్న ఎలా ఉన్నావు" అంటూ రాజమండ్రి సెంట్రల్ జైలు అడ్రస్‌తో పోస్ట్‌కార్డులు పంపారు. కొరిశపాడు మండలం సోమవారప్పాడులో కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని బొడ్డురాయి వద్ద కొబ్బరికాయలు కొట్టారు. విశాఖ జిల్లా ఎండాడలో తెలుగుదేశం, జనసేన నేతలు కాడగాల ర్యాలీ చేశారు. ర్యాలీ తర్వాత అమ్మవారి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సంతకాల సేకరించారు.

Tags

Read MoreRead Less
Next Story