తిరుపతిలో ప్రజాస్వామ్యం నడుస్తోందా: టీడీపీ అనుమానం

తిరుపతిలో ప్రజాస్వామ్యం నడుస్తోందా అనుమానం కలుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్నికల్లోనూ వైసీపీ బరితెగించిందని ఆరోపిస్తోంది టీడీపీ. రౌడీ ముఖ్యమంత్రి ప్రోద్బలంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శించింది. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి మరీ రిగ్గింగ్ చేస్తోందని వైసీపీపై మండిపడింది ప్రతిపక్షం. అధికార బలంతో పోలింగ్ బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్న వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దొంగ ఓట్లు వేసేందుకు తిరుపతిలోని పీఎల్‌ఆర్ కల్యాణమండపానికి వైసీపీ కార్యకర్తలు వచ్చారంటూ ఆరోపించింది టీడీపీ. వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు గట్టిగానే నిలువరించడంతో.. కల్యాణ మండపం వెనక నుంచి ఎక్కడివాళ్లు అక్కడ పారిపోయారని టీడీపీ లీడర్లు చెడుతున్నారు. పీఎల్‌ఆర్ కల్యాణమండపం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో.. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వగ్రామంలో వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపించింది. శ్రీకాళహస్తి మండలం అమ్మపాళ్యంలో తమ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని టీడీపీ ఆరోపించింది. రౌడీ ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారన్న టీడీపీ.. తిరుపతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని సైతం బజారుకీడ్చారని మండిపడింది. అలాంటప్పుడు ఇక ఎన్నికలు ఎందుకని ప్రశ్నించింది. వెంటనే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అధికార దుర్వినియోగంతో పోలింగ్‌ను ఏకపక్షంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారన్న ప్రతిపక్షం.. తిరుపతిలో ఓటర్ల హక్కును, స్వేచ్ఛను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కండేళు గుంటలో టీడీపీ, బీజేపీ ఏజెంట్లను వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీల నేతలు ఆరోపించారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా అరాచకం సృష్టిస్తున్నారంటూ.. వైసీపీ నాయకులతో టీడీపీ, బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఓవైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్నా పోలీసులు మాత్రం చూస్తూ ఉండిపోయారంటూ టీడీపీ, బీజేపీ ఆరోపించింది.
పుంగనూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను తరలించారని, ఉదయాన్నే రిగ్గింగ్‌కు ప్రయత్నం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఊళ్లలో లేనివాళ్లు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు, చనిపోయిన ఓటర్లను గుర్తించి రిగ్గింగ్ చేయాలని చూస్తోందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
దొంగ ఓట్లు వేయించడానికి చిత్తూరు నుంచి వందలాది బస్సుల్లో వైసీపీ కార్యకర్తలను తరలించారని ఆరోపించింది టీడీపీ. ఓ మంత్రి దగ్గరుండి మరీ తిరుపతికి వందలాది మంది వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని ఓ మంత్రి ఫంక్షన్ హాల్ వద్ద ఇప్పటికే 1500 మంది ఉన్నారని చెబుతోంది. వారందరినీ దొంగ ఓట్లు వేయించడానికే తీసుకొచ్చారన్నది టీడీపీ ఆరోపణ. పుంగనూరు నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లు వస్తున్నారంటూ చంద్రబాబు ఇప్పటికే ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తూ లేఖ కూడా రాశారు చంద్రబాబు. భద్రతా బలగాలను ఉపయోగించి బస్సుల్లో తరలివస్తున్న వాళ్లని అడ్డుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నుంచి బస్సుల్లో వచ్చిన 500 మందిని ఇప్పటికే తిరుపతి పోలింగ్ బూత్‌లకు తరలించారంటోంది టీడీపీ.
పీఎల్‌ఆర్ కల్యాణ మండపంలో వందల సంఖ్యలో బయటి ప్రాంత వ్యక్తులు ఉన్నారంటూ ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి చింతా మోహన్. కడప రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలలో వారందరూ తిరుపతికి వచ్చారని చెప్పుకొచ్చారు. పోలీసులు పీఎల్‌ఆర్ కల్యాణ మండపం తనిఖీ చేసి, బయటి నుంచి వచ్చిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com