AP: ఓట్ల వేట ముమ్మరం చేసిన కూటమి అభ్యర్థులు

AP: ఓట్ల వేట ముమ్మరం చేసిన కూటమి అభ్యర్థులు
మళ్లీ ఎన్నికల ప్రచారంలో అచ్చెన్నాయుడు.... టీడీపీ-జనసేనలో భారీగా చేరికలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ అభ్యర్థులు ఓట్ల వేటను ముమ్మరం చేశారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. కూటమి అభ్యర్థులు సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరిస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి పెద్దసంఖ్యలో నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తులసిపేటలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రచారంలో పాల్గొన్నారు. మార్చి 31న తల్లి మరణంతో ప్రచారం నిలిపివేసిన అచ్చెన్న... మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. గ్రామానికి చెందిన ఇద్దరు వాలంటీర్లు అచ్చెన్న సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.


అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి వరుసగా పదోసారి బరిలోకి దిగుతున్న అయ్యన్నపాత్రుడు తరఫున ఆయన సతీమణి,కోడళ్లు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు... మూడు పార్టీల కార్యకర్తలతో కలిసి బైక్‌ ర్యాలీతో ప్రచారం చేశారు. ఇంటింటికీ సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలు అందజేసి ఓ ట్లు అభ్యర్థించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తరఫున ఆయన సతీమణి తులసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే... అందించనున్న సంక్షేమ పథకాలను వివరించారు. నెల్లూరు అర్బన్‌లో మాజీ మంత్రి నారాయణ తరఫున... ఆయన కుమార్తె సింధూర ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ... తన తండ్రికి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. చిత్తూరు కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సమక్షంలో నగరపాలక కో-ఆప్షన్‌ సభ్యురాలు నళిని దంపతులు తెలుగుదేశంలో చేరారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో కూటమి నేతలు... కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


అనంతపురం జిల్లా గుంతకల్లులో నలుగురు వైకాపా కౌన్సిలర్లు, ముగ్గురు మాజీ కౌన్సిలర్లు, పలువురు నాయకులు తెలుగుదేశంలో చేరారు. వీరికి కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం కండువా కప్పి... పార్టీలోకి ఆహ్వానించారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని పలు గ్రామాల్లో కూటమి అభ్యర్థి బండారు శ్రావణి విస్తృత ప్రచారం చేశారు. లోక్‌సభ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి... ఇంటింటికీ తిరిగి బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీపై ప్రజలకు వివరించారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర కూటమి అభ్యర్థి సునీల్‌ కుమార్‌... పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గవ్యాప్తంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సైకో పోవాలి... సైకిల్‌ రావాలి అనే నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

Tags

Read MoreRead Less
Next Story