TDP-JANASENA: నేడే టీడీపీ-జనసేన తొలి జాబితా!

నేతలు, కార్యకర్తలు, ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఉదయం 11గంటల తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిపి నడుస్తామని, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీల నేతలు చెబుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటే స్పష్టత రాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. బీజేపీతో పొత్తుపై ఇంకా స్పష్టత రానుందున. ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో ఏడు జాబితాలు విడుదల చేసింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థులు వారేనని సంకేతాలిస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కొందరికి బాగా పనిచేసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే ఎక్కడా అభ్యర్థుల పేర్లను మాత్రం ప్రకటించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అధినేతలు భావిస్తున్నారు.
బీజేపీతో పొత్తును దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీకి ఆసక్తి ఉన్న స్థానాలు కాకుండా.. మిగిలిన సీట్లలో కొన్నింటికి అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. ఏదైనా ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప నేడు అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి జాబితా విడుదలకు ముందు అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలకసమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు, యనమల, రామానాయుడు, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, చినరాజప్ప, నక్కా ఆనంద్ బాబు నేతలకు అధిష్టానం నుంచి పిలుపువెళ్లింది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. పొత్తులు, ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేసే దిశగా తెలుగుదేశం జనసేన కసరత్తు ముమ్మరం చేశాయి. ఎవరు ఎక్కడ పోటీ చేసే అంశంపై వీలైనంత త్వరగా నేతలకు, శ్రేణులకు స్పష్టత ఇచ్చే దిశగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పనిని వేగవంతం చేశారు. శుక్రవారమే చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకోగా, పవన్ కళ్యాణ్ కూడా విడిగా అమరావతికి వచ్చారు. అభ్యర్థుల ప్రకటనపై ఇరు పార్టీల నేతలు ,శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందో లేదో అనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com